హైదరాబాద్ జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువులోని నీటిని తూము ద్వారా దిగువకు విడుదల చేసేందుకు అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. భారీ వర్షాలతో పూర్తిగా నిండడం వల్ల తెరిచేందుకు యత్నిస్తున్నారు. లీకేజీ అవుతుందని గతంలో మూసేయడంతో అది తెరవడం కాస్త కష్టంగా మారిందని అంటున్నారు.
చెరువు ప్రస్తుతం నిండుకుండలా మారి ఎగువనున్న ఉమామహేశ్వర్ కాలనీ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో పాటు క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. తూము ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తే పరిసర ప్రాంతాలకు ఉపశమనం కలుగనుంది. తూమును తెరిచేందుకు ప్రత్యేకంగా నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాలకు చెందిన నిపుణులను తీసుకు వచ్చారు. వారు నీటి లోపలికి వెళ్లి గంటల తరబడి ప్రయత్నిస్తూనే ఉన్నారు.
తూములో పూర్తిగా వ్యర్థాలు ఉన్నాయని ఇరిగేషన్ ఏఈ రామారావు తెలిపారు. మరికొన్ని గంటల సమయం పట్టొచ్చునని వెల్లడించారు. పరిస్థితిని ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.
ఇదీ చదవండి:'కేంద్ర నిధులపై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చకు సిద్ధమా?'