హైదరాబాద్‌లో నాలాలు కుహరాలుగా మారుతున్నాయి. మొన్న సుమేధ.. నిన్న నవీన్.. అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి ప్రాణాలు కోల్పోయిన అమాయకులు. గతంలోనూ ఇటువంటి సంఘటనలెన్నో జరిగినా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా వర్షాకాలంలో నిత్యం ఏదోమూలన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదకరంగా మారిన నాలాలు, మ్యాన్‌హోళ్ల వల్ల జరిగే ప్రమాదాల్లో మరణించటమో, తీవ్రంగా గాయపడటమో జరుగుతున్నాయి. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్వని అధికారులు కోట్లాది రూపాయలతో తాత్కాలిక మరమ్మతులకు ప్రాధాన్యమిస్తున్నారు.
నిధులిచ్చినా.. అదే నిర్లక్ష్యం
గ్రేటర్ పరిధిలో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శివారు ప్రాంతాల్లో పొంగిపొర్లుతున్న నాలాలు, మ్యాన్‌హోళ్లకు భయపడి సామాన్యులు బయటకు వచ్చేందుకు జంకే పరిస్థితులు నెలకొన్నాయి. రెండేళ్లుగా నాలాల విస్తరణ పనులు అటకెక్కాయి. రూ.230 కోట్లతో నాలాల విస్తరణ పనులు అట్టహాసంగా మొదలుపెట్టిన అధికారులు అటువైపు కన్నెతి చూడటం మానేశారు. నాలాల అభివృద్ధి కోసం చేపట్టిన పనుల్లో ఇప్పటి వరకు కేవలం 20-25 శాతం వరకు కూడా చేయలేదంటే నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందనేది అర్థ.మవుతోంది. స్థానిక నేతలు, అధికారుల వద్ద కాలనీ ప్రజలు ముందుగానే నాలాల ప్రమాదంపై హెచ్చరించినా స్పందించలేదంటూ ఆరోపణలు పెరుగుతున్నాయి. నేరెడ్‌మెట్ ఘటనలో అధికారులు ముందుగానే మేల్కొని ఉంటే సుమేధ ప్రాణం పోయేది కాదంటూ కాలనీ వాసులు జీహెచ్‌ఎంసీ అధికారులు, శాసనసభ్యుడుని నిలదీయటమే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం.
అధ్యయనాలు చెబుతున్నా కదలరే..
గ్రేటర్‌వ్యాప్తంగా 1295 కి.మీ నాలాల పొడవు, వీటిలో 390 కి.మీ పరిధిలో ఓపెన్ నాలాలున్నాయి. దుకాణాలు, నివాసాల విస్తరణకు నాలాలను పూడ్చివేస్తున్నారు. ఏటా పూడిక తీసేందుకు రూ.40-50 కోట్లు వెచ్చిస్తున్నట్లు లెక్కలు చూపుతున్నారు. ఆశించిన ప్రయోజనం పొందలేకపోతున్నారు. మురుగునీరు, వరదనీరు పోయేందుకు వేర్వేరు మార్గాలున్నా పర్యవేక్షణ కొరవడుతోంది. రెండేళ్ల క్రితం మురుగునీటి వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనిపై ప్రైవేటు సంస్థల ద్వారా అధ్యయనం చేయించారు. నగరంలో 2000లో కురిసిన భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. దీనికి పరిష్కారం చూపేందుకు ఆ తరవాత వచ్చిన ప్రభుత్వం అధ్యయనం చేయించింది. 2016లో మరోసారి భారీ వర్షాలకు గ్రేటర్ అతలాకుతలమైంది. నాలాల ఆక్రమణ, చెరువుల కబ్జాలతో ముంచుకొచ్చిన ముప్పు తెలిసొచ్చింది. ఈ దుస్థితికి ఆక్రమణలు కారణమని వివిధ విభాగాలు వేర్వేరుగా నిర్వహించిన అధ్యయనంలో గుర్తించాయి.
ఎవరిదీ తప్ఫు.. ఎప్పటికో కనువిప్పు
కొద్దికాలం క్రితం భారీ వర్షానికి నిలిచిన వరదనీటితో మ్యాన్‌హాల్ కనిపించక ఓ వ్యక్తి పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. పదేళ్ల క్రితం నగర శివారులో ఓ ఉపాధ్యాయుడు నాలాలో కొట్టుకుపోయి మరణించాడు. ఇవన్నీ కేవలం ఉదాహరణలు మాత్రమే. నగరంలోని ఫిలింనగర్, జూబ్లీహిల్స్, యూసుఫ్‌గూడ, షేక్‌పేట్ తదితర ప్రాంతాల్లో ఓపెన్‌నాలాలు వరదనీటితో ప్రమాదకరంగా ప్రవహిస్తుంటాయి. ప్రస్తుతం 390 కిలోమీటర్ల పరిధిలోని ఓపెన్ నాలాలు బస్తీలు, కాలనీల నుంచి వెళ్తుంటాయి. పూడిక తీయక పేరుకుపోయిన వ్యర్థాలతో మరింత ప్రమాదకరంగా తయారయ్యాయి.
ఇదీ చదవండి: ముట్టుకోకుండానే మోగుతున్న గుడి గంట