కొవిడ్ రక్కసి ధాటికి రాష్ట్రం విలవిల్లాడుతోంది. నిత్యం వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఏ రోజుకారోజూ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. శుక్రవారం ఏకంగా 1,892 మందికి వైరస్ సోకడం.... పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే అత్యధికంగా 1,658 కేసులు రావడం కలకలం రేపుతోంది.
20వేల దాటిన భాదితుల సంఖ్య..
శుక్రవారం నమోదైన 1,892 కేసులతో... రాష్ట్రంలో కొవిడ్ బాధితుల సంఖ్య 20 వేలు దాటింది. మొత్తం 20 వేల 462 మంది కరోనా కోరలకు చిక్కారు. కేవలం మూడు రోజుల్లోనే 4,123 మంది వైరస్ బారిన పడటం.... కరోనా విజృంభణకు నిదర్శంగా నిలుస్తోంది. శుక్రవారం 5,965 పరీక్షలు చేశారు. రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం కొవిడ్ టెస్టుల సంఖ్య లక్షా 4 వేల 118కి చేరింది. శుక్రవారం మరో 8మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ వల్ల చనిపోయినవారి సంఖ్య 283కి చేరింది.
జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ..
కరోనా తీవ్రత హైదరాబాద్ చుట్టు పక్కలే ఎక్కువగా ఉంది. శుక్రవారం రికార్డు స్థాయిలో 1,658 మంది వైరస్ బారిన పడ్డారు. రాష్ట్రంలో నమోదైన 20వేలకుపైగా కేసుల్లో.... 16 వేల మంది బాధితులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో 56, మేడ్చల్ జిల్లాలో 44 కేసులు వెలుగు చూశాయి. జీహెచ్ఎంసీ కేసులకు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలను కలిపితే వైరస్ బాధితుల సంఖ్య 18వేలకు చేరుతోంది. విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తుండటం వల్ల భారీగా పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి.
జిల్లాల్లోనూ...
శుక్రవారం వరంగల్ గ్రామీణ జిల్లాలో ఏకంగా 41మందికి వైరస్ సోకింది. సంగారెడ్డిలో 20 మంది కరోనా బారిన పడ్డారు. నల్గొండలో 13, మహబూబ్‌నగర్‌లో 12 మందికి కరోనా నిర్ధరణ అయింది. మహబూబాబాద్ జిల్లాలో 7 కేసులు రాగా... రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాలో ఆరు చొప్పున కేసులు నమోదయ్యాయి. వనపర్తిలో 5, భద్రాద్రి కొత్తగూడెంలో నలుగురికి వైరస్ నిర్ధరణ అయింది. సిద్దిపేట, మెదక్, నిజమాబాద్‌లో మూడేసి కేసులు రాగా... ఖమ్మం, నిర్మల్‌లో రెండేసి కేసులు వచ్చాయి. కరీంనగర్, గద్వాల, ములుగు, జగిత్యాల, వరంగల్ అర్బన్, నాగర్‌కర్నూల్, వికారాబాద్‌లో ఒక్కో కేసు నమోదయ్యాయి.
ఇవీ చూడండి: 'మహా'లో కరోనా రికార్డు.. ఒక్కరోజే 6వేలమందికి వైరస్