కరోనాతో పోరాడి గెలిచినా.. కొందరిని బ్లాక్ ఫంగస్ రూపంలో మరో మహమ్మారి కలవరపెడుతోంది. గుజరాత్, మహారాష్ట్రలలో ఇటీవల కలకలం రేపిన బ్లాక్ ఫంగస్ కేసుల ఆనవాళ్లు.. ఏపీలోనూ వెలుగు చూస్తున్నాయి. శ్రీకాకుళం, కర్నూలు, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో.. పలువురు ఈ ఫంగస్ బారిన పడ్డారు.
కర్నూలు ఆస్పత్రిలో ముగ్గురు వ్యక్తులు కరోనా నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లారు. బ్లాక్ ఫంగస్ లక్షణాలతో వారిలో ఇద్దరు తిరిగి ఆస్పత్రికి వచ్చారు. అక్కడే చికిత్స పొందుతూ మరణించారు. హైదరాబాద్లో ఓ యువకుడూ ప్రాణం కోల్పోయాడు. కృష్ణా జిల్లాలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందిన వ్యక్తికి బ్లాక్ ఫంగస్ సోకింది. సంబంధిత ఔషధాలను అతి కష్టం మీద సమకూర్చిన అధికారులు.. తగిన చికిత్స అందించారు. మున్ముందు చికిత్సకు అవసరమైన మందుల కొనుగోలుకు చర్యలు చేపట్టామని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
సాధారణ రోజుల్లో అరుదుగా కనిపించే బ్లాక్ ఫంగస్ ఇప్పుడు కరోనా బాధితుల పాలిట శాపంగా మారుతోంది. మధుమేహ వ్యాధి గ్రస్తులు, కరోనా చికిత్సలో స్టెరాయిడ్స్ అధికంగా వినియోగించిన సందర్భాల్లో ఈ ఫంగస్ ముప్పు ఏర్పడుతోందని వైద్యులు విశ్లేషించారు. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే.. ప్రమాదం నివారించొచ్చని చెబుతున్నారు.
ఏపీలో బ్లాక్ ఫంగస్ కేసులు మరిన్ని పెరిగే ప్రమాదం ఉందని ఆ రాష్ట్ర వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకు తగినట్లుగా ఔషధాలు అందుబాటులో ఉంచుకోవాల్సిన అవసరముందని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: తొలి డోసు తర్వాత కరోనా సోకే అవకాశం తక్కువ!