విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చేందుకు ముందుకు రాని రాష్ట్రాలకు రుణాలివ్వడం నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్థలను ఆదేశించింది. తెలంగాణ జెన్‌కోకు జాతీయ విద్యుత్ ఆర్థిక సంస్థ(పీఎఫ్‌సీ), గ్రామీణ విద్యుత్ విద్యుదీకరణ సంస్థ(ఆర్‌ఈసీ)ల నుంచి రూ.20 వేల కోట్ల రుణాల పంపిణీ నిలిచిపోయింది.
ఆగిపోయిన నిధులు...
నల్గొండ జిల్లా దామెరచర్ల వద్ద నిర్మిస్తున్న ‘యాదాద్రి విద్యుత్కేంద్రం’ పనులకు నెలవారీగా ఇవ్వాల్సిన రూ.380 కోట్ల బిల్లుల చెల్లింపులను పీఎఫ్‌సీ ఆపివేసింది. భద్రాద్రిని రూ.9,265 కోట్ల వ్యయంతో 2015లో, యాదాద్రిని రూ.29,965 కోట్ల వ్యయంతో 2017 అక్టోబరు 17న తెలంగాణ జెన్‌కో నిర్మాణం ప్రారంభించింది. వీటి కాంట్రాక్టులను భెల్‌కు ఇచ్చింది.
జెన్‌కో పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీల నుంచి రుణాలను తీసుకుంది. గత నెలలో రూ.500 కోట్ల పనులు చేశామని భెల్ సంస్థ జెన్‌కోకు బిల్లులు పెట్టింది. ఇందులో రూ.380 కోట్లను విడుదల చేయాలని పీఎఫ్‌సీకి జెన్‌కో పంపింది. ఇవి కాకుండా మరో రూ.1500 కోట్ల బిల్లులు పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీలకు జెన్‌కో పంపాల్సి ఉంది. సంస్కరణలు లేనందున డిస్కంలు నష్టాల్లో ఉన్నాయని, రుణాలిస్తే ఎలా చెల్లిస్తారని నిధుల విడుదలను పీఎఫ్‌సీ నిలిపివేసింది.
జెన్‌కో ఆందోళన
భద్రాద్రి కేంద్రంలో ఒక్కోటీ 270 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం గల 4 యూనిట్లు నిర్మిస్తున్నారు. వీటిలో మూడు పూర్తయ్యాయి. మిగిలినదాన్ని కూడా వచ్చే నెలాఖరులోగా ప్రారంభించాలని జెన్‌కో వేగంగా పనిచేస్తోంది. యాదాద్రి విద్యుత్కేంద్రంలో ఒక్కోటీ 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం గల 5 ప్లాంట్లను నిర్మించాలి. పనులు ముమ్మరంగా సాగుతున్న దశలో రుణం సొమ్ము విడుదలను పీఎఫ్‌సీ ఆపడంతో జెన్‌కో ఆందోళన చెందుతోంది.
గతంలోనే భద్రాద్రి, యాదాద్రిలకు పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీలు రుణాలిస్తామని అంగీకారం తెలిపాయి. ఈ రెండింటికీ కలిపి రూ.35 వేల కోట్లలో ఇప్పటికే 15 వేల కోట్ల రూపాయల వరకూ విడుదల చేశాయి. మిగిలిన రూ.20 వేల కోట్లను విడుదల చేయాలి. ‘‘సంస్కరణలు లేవని, నష్టాలున్నాయనే సాకుతో ఆపాలని భావిస్తే ఎలా.. ఆ నిబంధన కొత్తగా రుణాల కోసం దరఖాస్తు చేసేవాటికే వర్తిస్తుంది. పాత రుణాలకు ఎలా వర్తింపజేస్తారు’’అని సీనియర్ అధికారి ఒకరు ప్రశ్నించారు.
ఇదీ చూడండి: కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఐఎంఏ వైద్యుల ధర్నా