యువ వైద్యురాలి అత్యాచార హత్య ఘటనతో అట్టుడుకుతున్న హైదరాబాద్లో మరో దారుణం కలకలం రేపుతోంది. నిజాంపేట్లో నివాసముంటున్న ఓ సాప్ట్వేర్ ఉద్యోగినిపై ఆమె స్నేహితుడే అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను గదిలో ఉంచి బయట తాళం వేసి ఉడాయించాడు. తన సోదరి ఇంటికి వచ్చే సరికి అపస్మారక స్థితిలో కనిపించిన తన చెల్లిని చూసి... పోలీసులకు సమాచారమిచ్చింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
హైదరాబాద్ నిజాంపేటలో 8 నెలలుగా బాధితురాలితో పాటు ఆమె సోదరి, ఓ చిన్నారి నివాసముంటున్నారు. ఓ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోన్న బాధితురాలి సోదరి... ఉదయాన్నే పాఠశాలకు వెళ్లిపోయింది. వివాహ సంబంధం గురించి మ్యాట్రిమొనీ సంస్థ నుంచి శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 8 మంది వారి ఇంటికి వచ్చారు. 3 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు.
మధ్యాహ్నం ఇంటి నుంచి అరిచిన శబ్దం వచ్చిందని... వెళ్లి చూస్తే తాళం వేసి ఉందని ఇంటి యజమాని భార్య తెలిపింది. అయితే సాయంత్రం ఓ యువకుడు కంగారుగా బయటకు వెళ్లాడని తెలిపింది.
సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చిన సోదరి... బాధితురాలు అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించింది. బాధితురాలిని వివరాలు అడిగి తెలుసుకున్న పోలీసులు... జాయల్చంద్ ఈ అఘాయిత్యానికి పాల్పడట్టుగా తెలుసుకున్నారు. నిందితుడి కోసం సీసీటీవీ కెమెరాల దృశ్యాల ఆధారంగా గాలింపు చేపట్టారు.
ఇవీ చూడండి: శంషాబాద్ నిందితులను పట్టించిన ఫోన్ కాల్