తెలంగాణ కాంగ్రెస్ (telangana congress) ప్రజాసమస్యలపై స్వరం పెంచుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజా క్షేత్రంలో ఎండకడుతోంది. రాష్ట్రంలో దళిత గిరిజనుల ఆత్మ గౌరవ దండోరా సభలు విజయవంతం కావడంతో... అదే జోష్తో మరో పోరాటానికి కార్యాచరణ ప్రకటించింది. రాష్ట్రంలో విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలపై ఉద్యమానికి ప్రణాళిక ఖరారు చేసింది.
మరో పోరాటానికి కాంగ్రెస్ సిద్ధం
అక్టోబర్ 2న గాంధీ జయంతి నుంచి డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం సాకారమైన రోజు వరకు 67 రోజుల పాటు జనంలోకి వెళ్లేందుకు కార్యాచరణ ప్రకటించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉద్యోగావకాశాలు కల్పిస్తామని.. నిరుద్యోగులకు 3,016 రూపాయలు, నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి కేసీఆర్ (kcr) ముఖ్యమంత్రి అయ్యారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శిస్తోంది. తెలంగాణ యువత ఆకాంక్షలకు వ్యతిరేకంగా కేసీఆర్ పాలన చేస్తూ... నిరుద్యోగులను మోసం చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.
విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్
తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యావ్యవస్థ బలోపేతం కావడం అటుంచి... నాలుగు వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలు మూసేసి పేద విద్యార్థులను విద్యకు దూరం చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని సమైక్యాంధ్రలో కాంగ్రెస్ తెచ్చిన ఫీజు రియంబర్స్ మెంట్ను తెరాస ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శిస్తోంది. బిస్వాల్ కమిటీ నివేదిక మేరకు లక్షా 91వేల 638 ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని కోరుతుంది. వీటన్నింటిపై విద్యార్థి, నిరుద్యోగుల జంగ్ సైరన్( Congress Nirudyoga Jung Siren) పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైంది.
ముగింపు సభకు రాహుల్
విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగ యువతకు బాధలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయి పోరాటానికి కార్యాచరణ ప్రకటించింది. అందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండలాలు, నియోజక వర్గాలు, యూనివర్సిటీల్లో ప్రత్యేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. రెండు నెలలకు పైగా నిరంతరంగా సాగే ఆందోళనల ద్వారా యువతకు, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టనుంది. అందులో భాగంగా మొదటి రోజు దిలీషుఖ్నగర్ రాజీవ్ చౌరస్తా నుంచి ఎల్బీ నగర్ శ్రీకాంత చారి సర్కిల్ వరకు విద్యార్థులతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహిస్తారు. డిసెంబర్ 9న పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న ముగింపు సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ తెలిపారు.
కాంగ్రెస్ ప్లాన్ ఫలించేనా..?
తెలంగాణ ఉద్యమ కేంద్రాలుగా మారిన అన్ని విశ్వవిద్యాలయలల్లో సభలు, నిరసన ర్యాలీలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ జంగ్ సైరన్తో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన విద్యార్థి, నిరుద్యోగ యువతను తమ వైపునకు ఆకర్షించే కార్యచరణ సిద్ధం చేసింది. కాంగ్రెస్ ప్లాన్ ఏమాత్రం ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి.