New Year 2024 Police Guidelines in Hyderabad : మరో నాలుగు రోజుల్లో కొత్త ఏడాదిలోకి ప్రవేశించబోతున్నాం. ఈ నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలను అందరూ ఎంతో ఉత్సాహంతో జరుపుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే న్యూయర్ వేడుకల్లో(New Year Celebrations) ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సైబరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. అందులో భాగంగా ఓఆర్ఆర్ సహా పలు పైవంతెనలను డిసెంబర్ 31వ తేదీన మూసివేయనున్నారు.
New Year 2024 Restrictions in Hyderabad : డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి జనవరి 1వ తేదీ ఉదయం 5 గంటల వరకు బాహ్య వలయ రహదారి, పీవీ ఎక్స్ప్రెస్ పైవంతెన మూసివేయనున్నట్లు పోలీసుు తెలిపారు. విమానాశ్రయానికి వెళ్లే వాహనాలకు మాత్రం పీవీఎక్స్‌ప్రెస్(PV Express Way) పైవంతెన మీద నుంచి అనుమతించనున్నట్లు చెప్పారు. శిల్పా లేఅవుట్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, షేక్‌పేట్, మైండ్ స్పేస్, సైబర్ టవర్, ఫోరం మాల్, జేఎన్టీయూ, ఖైత్లాపూర్, బాలానగర్ పై వంతెనలతో పాటు దుర్గం చెరువు తీగల వంతెన కూడా మూసివేస్తున్నట్లు వెల్లడించారు. పై వంతెనల మూసివేత కారణంగా వాహనదారులు ప్రత్యామ్నాయ రహదారుల్లో ప్రయాణించాలని సూచించారు. క్యాబ్, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్లు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు.
New Year Celebration 2024 : ఈ నిబంధనలు ఉల్లంఘించే వారిపై వాట్సాప్ నంబర్ 9490617346కు ఫిర్యాదు చేయవచ్చని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ తనిఖీల్లో పట్టుబడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. బార్‌లు, పబ్బుల్లో మద్యం సేవించి తిరిగి వెళ్లే సమయంలో ఆయా పబ్‌లు, బార్ల నిర్వాహకులు డెసిగ్నేటెడ్ డ్రైవర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రధానంగా వేగంగా వాహనాలు నడపినా, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణించినా చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.
పోలీసులు హెచ్చరిక : వాహనాలలో కిక్కిరిసి ప్రయాణించడం, వాహనాల పై భాగంలో ప్రయాణించడం, బహిరంగ ప్రదేశాల్లో ఇబ్బంది కలిగించడం వంటివి చేసినా కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, మితి మీరిన శబ్దాలు, ప్రమాదకరంగా వాహనాలు నడపడం, వాహనాలపై ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది ప్రయాణిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. వాహనదారులు జాగ్రత్తగా, బాధ్యతగా సురక్షితంగా వాహనాలు నడిపి నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని ఉన్నతాధికారులు కోరారు.
హైదరాబాద్లో న్యూయర్ వేడుకలకు రాచకొండ సీపీ హుకుం - యువత జరభద్రం ఇక
హైదరాబాద్లో న్యూయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు - రాత్రి 1 గంట వరకే పర్మిషన్