రాష్ట్రంలోని 9,335 గ్రామ పంచాయతీలకు త్వరలోనే నూతన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు నియమితులు కానున్నారు. ఎన్నికల నిబంధనావళి నుంచి వెసులుబాటు కల్పిస్తూ.. వీరిని నియమించుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా పంచాయతీరాజ్ శాఖ పంపిన దస్త్రంప్రస్తుతం రాష్ట్రముఖ్య ఎన్నికల అధికారి పరిశీలనలో ఉంది.
ఒక్కో పంచాయతీకి ఒక్కో కార్యదర్శి
కార్యదర్శుల నియామకాల కోసం అక్టోబర్లో నిర్వహించిన రాతపరీక్ష సందర్భంలో ఇచ్చిన పత్రంలోని ప్రశ్నలన్ని సక్రమంగానే ఉన్నట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తేల్చింది. ఈ నివేదికతో నియామకాలకు మార్గం సుగమమైంది. రాష్ట్రంలో ఒక్కో గ్రామ పంచాయతీకి ఒక్కో కార్యదర్శి ఉండాలనే నిర్ణయంలో భాగంగా ప్రభుత్వం 2018లో పరీక్ష నిర్వహించింది. మార్కుల ఆధారంగా పంచాయతీరాజ్ కమిషనర్ నేతృత్వంలోని కమిటీ అభ్యర్థులను ఎంపిక చేసింది. జిల్లాల వారిగా నియామక ప్రక్రియను డిసెంబర్లో మొదలుపెట్టగానే హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై ప్రభుత్వకమిటీని ఏర్పాటు చేసి దాని నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. ప్రభుత్వం వేసిన కమిటీ ప్రశ్నలన్నీ సక్రమంగానే ఉన్నట్టుగా తేల్చింది.
ఈసీకి విజ్ఞప్తి
కమిటీ నివేదిక వెలువడేసరికి మండలి ఎన్నికల నిబంధనావళి అమల్లోకి వచ్చి నియామకాలకు మరో ప్రతిబంధకం ఏర్పడింది. ప్రక్రియను అక్టోబర్లోనే చేపట్టినందున నియామకాలకు అనుమతివ్వాలంటూ పంచాయతీరాజ్ శాఖ కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. దస్త్రం ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పరిశీలనలో ఉందని, అనుమతి రాగానే నియామకాలు చేపడతామని పంచాయతీరాజ్ అధికార వర్గాలు తెలిపాయి.
ఇవీ చూడండి:పారదర్శకంగా ఎన్నికలు