సచివాలయానికి సమీపంలో, ఇప్పుడున్న ఎమ్మెల్యేల నివాస ప్రాంగణ స్థలంలో శాఖాధిపతుల కార్యాలయాలను నిర్మిస్తే బాగుంటుందనే అభిప్రాయానికి సర్కారు వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అధికారులు మంగళవారం ఈ స్థలాన్ని పరిశీలించారు. ‘ఎమ్మెల్యేల నివాస ప్రాంగణం పది ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉంది. ప్రస్తుతం అక్కడి భవనాల్లో అనేకం శిథిలమయ్యాయి. కొన్ని మాత్రమే ఉపయోగంలో ఉన్నాయి. 104 కార్యాలయాలకు ఈ స్థలం సరిపోని పక్షంలో మరో ప్రత్యామ్నాయం చూస్తాం’ అని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. దిల్లీ తరహాలో కాన్‌స్టిట్యూషన్ క్లబ్ నిర్మించాలనీ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనికి ఎమ్మెల్యే నివాస ప్రాంగణం సమీపంలోని పాత రిడ్జ్ హోటల్ స్థలాన్ని పరిశీలించనున్నట్టు తెలిసింది.
‘మెగా డెయిరీ’ కోసం 32.20 ఎకరాలు లీజుకు
తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలో భారీ పాడి పరిశ్రమాభివృద్ధి కేంద్రం(మెగా డెయిరీ)ని ఏర్పాటు కానుంది. దీని కోసం మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామం ఇమారత్ కంచలో 32.20 ఎకరాల భూమిని పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్యకు 99 ఏళ్లపాటు లీజుకు ఇస్తూ పశుసంవర్థక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు రాష్ట్ర గొర్రెలు, మేకల పెంపకం దారుల సమాఖ్యకు ఏడాదికి ఎకరాకు రూ.30 వేల అద్దె చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇదీ చూడండి: బలగాల ఉపసంహరణ పూర్తి: చైనా