రాష్ట్రంలో బీసీ విద్యార్థినీ, విద్యార్థుల కోసం ప్రభుత్వం కొత్తగా గురుకుల డిగ్రీ కళాశాలలు(GURUKUL DEGREE COLLEGES) ఏర్పాటు చేయనుంది. బీసీ సంక్షేమశాఖ పరిధిలో పూర్వజిల్లాకు ఒక మహిళా, ఒక పురుషుల డిగ్రీ కళాశాల చొప్పున మొత్తం 20 ప్రారంభించేందుకు వీలుగా దస్త్రం సిద్ధమైంది. అది సీఎం కేసీఆర్(CM KCR) పరిశీలనలో ఉంది. ఈ ఏడాదే ఆ కళాశాలలను ప్రారంభించేందుకు వీలుగా నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలిసింది.
రాష్ట్రంలో బీసీ సంక్షేమశాఖ పరిధిలో ఒకే ఒక మహిళా డిగ్రీ గురుకుల కళాశాల సర్వేల్‌లో ఉంది. గురుకులాల సొసైటీల పరిధిలో ప్రయోగాత్మక ప్రాజెక్టు కింద ఇది ఏర్పాటైంది. ఇందులోని 240 సీట్లకు ఈ విద్యాసంవత్సరంలో దాదాపు 4,200 మంది విద్యార్థినులు పోటీపడ్డారు. ఈ కళాశాలలో ఏటా 90 శాతం మంది విద్యార్థినులు డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణులవుతున్నారు. ఇదే ఆదర్శంగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖల పరిధిలో మహిళా, పురుషుల గురుకుల డిగ్రీ కళాశాలలు భారీగా వచ్చాయి.
బీసీ సంక్షేమశాఖ పరిధిలో ప్రయోగాత్మక ప్రాజెక్టు కింద ఏర్పాటైన కళాశాల తప్ప కొత్తగా కళాశాల రాలేదు. ఈ నేపథ్యంలో పూర్వజిల్లాకు ఒకటి చొప్పున ప్రారంభించాలని బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలు చేసింది. నాగార్జునసాగర్ నియోజకవర్గానికి హామీ ఇచ్చిన బీసీ గురుకుల డిగ్రీ కళాశాల కూడా ప్రతిపాదనల్లో ఉంది. ఈ కొత్త కళాశాలలు మంజూరైతే డిగ్రీ కోర్సుల్లో 4,800 సీట్లు వచ్చే అవకాశముంది.
ఇదీ చదవండి: CM KCR: కేసీఆర్ చెప్పిన స్నేహితుడి మాట.. శోభమ్మ ముచ్చట విన్నారా?