New Fire Stations Inaugurated By Mohammad Ali : రాష్ట్రంలో అగ్నిమాపక శాఖ బలోపేతంపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే కైట్ ఐ, వివిధ రకాల పరికరాలను ఏర్పాటు చేసుకున్న ఈ శాఖ.. తాజాగా మరో కీలక ముందడుగు వేసింది. విపత్కర సమయాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్ తరహాలో సేవలందించే ఎస్‌డీఆర్‌ఎఫ్ అందుబాటులోకి తీసుకువచ్చింది. తెలంగాణలో 18 నూతన అగ్నిమాపక కేంద్రాలతో పాటు (Fire stations) సహాయ చర్యల కోసం 39 క్యూఆర్‌టీటీ వాహనాలు సమకూర్చుకుంది. ఆయా ఫైర్ స్టేషన్‌లను హోం మంత్రి మహమూద్ అలీ వర్చువల్‌గా ప్రారంభించారు.
అగ్ని ప్రమాదం సంభవిస్తే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తేవడం, అగ్నికిలల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా కాపాడడంతో ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించడానికి అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది నిర్వర్తించే విధులు అత్యంత కీలకమైనవి. ఇందుకోసం ఒక్కోసారి ఆ శాఖ సిబ్బంది ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి మరీ సహాయ చర్యల్లో నిమగ్నమవుతారు. అగ్నిమాపక శాఖ జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం తరహాలో రాష్ట్రంలో విపత్తు ప్రతిస్పందన దళాన్ని (SDRF) ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
32 New Rescue Tenders Launched in Telangana : మొదటి విడతగా ఏర్పాటైన ఈ దళంలో ముందుగా 50 మంది సిబ్బంది సేవలందించడానికి సిద్దంగా ఉన్నారు. అగ్నిప్రమాదాలు, భవనాలు కూలినప్పుడు, వరద ముంపు, భూకంపాలు వంటి విపత్తులు ఎదురైతే ఈ దళం సహాయ చర్యలు చేపడుతుంది. క్షతగాత్రులను రక్షిస్తుంది. ఎస్డీఆర్ఎఫ్లో విధులు నిర్వర్తించే సిబ్బంది ప్రమాదానికి దగ్గట్టు మాస్కులు, గ్యాస్‌కట్టర్లు, ఫేస్‌షీల్డ్‌లు, యువీఎక్స్ కళ్లద్దాలు, వాటర్ బోట్లు, పీవీసీ సూట్లు వంటివి ఉపయోగిస్తారు.
తెలంగాణ ఏర్పడక ముందు 39 ఫైర్‌స్టేషన్‌లు, 1841 సిబ్బంది ఉండేవారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఫైర్‌స్టేషన్‌లు, సిబ్బంది సంఖ్యను ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం రాష్ట్రంలో 146 అగ్నిమాపక కేంద్రాలు ఉండగా, సిబ్బంది సంఖ్య 2734కు పెంచారు. వీరితో పాటు 256 పొరుగు సేవల సిబ్బంది 15 ఫైర్ ఔట్ పోస్టుల్లో పని చేస్తున్నారు. 2023, 24 ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వం అగ్నిమాపక శాఖకు రూ.32.12 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది.
సికింద్రాబాద్ అగ్నిప్రమాదం.. ప్రాణాలు పణంగా పెట్టి సహాయక చర్యలు
నూతనంగా జూబ్లీహిల్స్, అంబర్‌పేట్, చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్, మల్కాజిగిరి, ఎల్బీ నగర్, అలంపూర్, నారాయణపేట్, జనగాం, మహబూబాబాద్, మెదక్, సిద్దిపేట్, నాగర్‌కర్నూలు, నిజామాబాద్, జగిత్యాల, ఖమ్మం, జోగులాంబ గద్వాల్ తదితర ప్రాంతాల్లో 18 కొత్త ఫైర్ స్టేషన్‌లను హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ వివిధ పరికరాలు, వాహనాలతో నిర్వహించిన ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలించింది. ఏ తరహా విపత్తులు ఎదురైనా సేవలు, సహాయ చర్యలు చేపట్టడానికి తాము సిద్దంగా ఉంటామని అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది చెబుతున్నారు. ప్రజలు అగ్నిప్రమాదల పట్ల జాగ్రత్తగా ఉండాలని పలు సూచనలు జారీ చేశారు.
Telangana Fire Department : 'ఎలాంటి రెస్క్యూకైనా మేం రెఢీ'.. తెలంగాణ అగ్నిమాపక శాఖ డీజీ