రాష్ట్రంలోని 24 జిల్లాల్లో నూతన కలెక్టరేట్లు నిర్మించాలని 2018లో ప్రభుత్వం నిర్ణయించింది. నిధులను వేగంగా విడుదల చేయకపోవటంతో చాలాచోట్ల పనులు కొలిక్కి రాలేదు. బిల్లుల కోసం గుత్తేదారులు మొన్నటివరకు రహదారులు, భవనాల శాఖ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయితే సిద్దిపేట, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్ పట్టణ, జనగాం, మేడ్చల్, వికారాబాద్, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో గుత్తేదారుల వెంటపడి పనులు చేయించడంతో దాదాపు పూర్తయ్యాయి.
పచ్చదనం, ఫర్నిచర్‌ను సిద్ధం చేసే పనులు ఆయాచోట్ల ముమ్మరంగా సాగుతున్నాయి. మే నెలలో ఈ జిల్లాల్లో భవన సముదాయాలను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ఒకట్రెండు జిల్లాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రారంభోత్సవాలు చేస్తారని అధికారులు చెబుతున్నారు.
- కరీంనగర్, ములుగు, నారాయణపేట జిల్లాల్లో కూడా కలెక్టరేట్ కార్యాలయాల నిర్మాణాలకు ప్రభుత్వం ఇటీవల అనుమతి మంజూరు చేసింది. కరీంనగర్ జిల్లాలో కలెక్టరేట్ భవనం 25-30 సంవత్సరాల మధ్య నిర్మించింది కావటంతో నూతన నిర్మాణానికి ప్రభుత్వం తొలుత అనుమతించలేదు. ఆ జిల్లా నేతలు పట్టుపట్టడంతో తాజాగా మంజూరు చేసింది.
- కుమురంభీం ఆసిఫాబాద్, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో పనులు 70 నుంచి 80 శాతం పూర్తయ్యాయి. ఆగస్టు నెలాఖరుకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు.
- మెదక్, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, మంచిర్యాల జిల్లాల్లో పనులు 40 శాతం మాత్రమే పూర్తయ్యాయి. మహబూబాబాద్ భవన నిర్మాణం కోసం నిర్మించిన సెంట్రింగ్ ఇటీవల కూలిపోవటంతో కూలీలు గాయపడ్డారు. అధికారులు ఆగమేఘాల మీద దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
జయశంకర్ భూపాలపల్లిలో భవన సముదాయాన్ని ఎక్కడ నిర్మించాలన్న అంశం రెండున్నరేళ్లుగా నలుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యంతో ఇటీవలే సమస్య కొలిక్కి వచ్చింది. నిధులు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఈ ఏడాది చివరి నాటికి అన్ని జిల్లాల్లో నిర్మాణాలు పూర్తి చేసేందుకు వీలుగా అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.
ఇదీ చూడండి: మూడు రోజుల పాటు సహజ సేంద్రియ ఉత్పత్తుల మేళా