జేఎన్‌టీయూహెచ్‌లో శనివారం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, ఎంసెట్ కన్వీనర్ ఆచార్య గోవర్ధన్, విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, ఇతర అధికారులు ఎంసెట్ అగ్రికల్చర్ ఫలితాలను విడుదల చేశారు. నీట్‌లో జాతీయస్థాయి ఆరో ర్యాంకర్, గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గుత్తి చైతన్య సింధు తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్‌లో ప్రథమ ర్యాంకు సాధించారు (ఏపీ ఎంసెట్ అగ్రికల్చర్‌లోనూ ఆమెకే తొలి ర్యాంకు).
నీట్ 14వ ర్యాంకర్ సాయిత్రిషారెడ్డి ఎంసెట్‌లో రెండో స్థానంలో నిలవగా.. నీట్ మూడో ర్యాంకర్ తుమ్మల స్నికిత ఎంసెట్‌లోనూ అదే ర్యాంకు సాధించడం విశేషం. నీట్‌లో 107వ ర్యాంకు సాధించిన దర్శి విష్ణుసాయి ఇక్కడ 4వ ర్యాంకు సాధించాడు (ఏపీ ఎంసెట్‌లోనూ ఈ విద్యార్థి 4వ ర్యాంకు పొందడం గమనార్హం). నీట్‌లో 33వ ర్యాంకు సాధించిన రుషిత్ ఇక్కడ 5వ ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. టాప్-10 ర్యాంకర్లలో ఏపీ, తెలంగాణ విద్యార్థులు చెరిసగం దక్కించుకున్నారు. పరీక్షలు రాసిన వారి సంఖ్య, అర్హత సాధించిన వారి సంఖ్యలోనూ అబ్బాయిల కంటే అమ్మాయిలే రెట్టింపు కావడం మరో విశేషం.
నవంబరు మొదటి వారంలో కౌన్సెలింగ్!
నవంబరు తొలి వారంలో బీఎస్‌సీ అగ్రికల్చర్ సీట్ల భర్తీకి ప్రవేశ ప్రకటన ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఈ సందర్భంగా పాపిరెడ్డి చెప్పారు. ఇంటర్ హాల్‌టికెట్ సంఖ్యలు తప్పుగా వేసిన వారు 2,200 మంది ఉండగా పలుమార్లు ఫోన్ చేసి తెప్పించామని, ఇంకా కొందరు స్పందించకపోవడంతో వారికి ర్యాంకులు ఇవ్వలేదని ఎంసెట్ కన్వీనర్ గోవర్దన్ తెలిపారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు లింబాద్రి, ఎంసెట్ కో కన్వీనర్ చంద్రమోహన్, సమన్వయకర్త రవీంద్రరెడ్డి పాల్గొన్నారు.
- 63,857 మంది పరీక్షకు హాజరుకాగా 59,113 మంది కనీస మార్కులు సాధించి అర్హత పొందారు. గత ఏడాది 93.01 శాతం మంది అర్హత సాధించగా ఈసారి అది 92.57 శాతమే
- ఇంటర్ లేదా సమాన హోదా మార్కులు ఇవ్వకపోవడం వల్ల 667 మందికి ర్యాంకులు కేటాయించలేదు.
- ఎంసెట్‌లో అర్హత సాధించినా ఇంటర్‌లో తప్పడం వల్ల 300 మంది ర్యాంకులు పొందలేకపోయారు.
శాస్త్రవేత్తగా రాణించడం నా లక్ష్యం...
నీట్‌కు సిద్ధమయ్యే క్రమంలోనే తెలంగాణ ఎంసెట్ కూడా రాశా. మంచి ర్యాంకు వస్తుందని ముందే ఊహించా. దిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చేస్తా. వైద్య విభాగంలో శాస్త్రవేత్తగా రాణించడం నా లక్ష్యం. (సింధు కుటుంబంలో ఇప్పటికే ముగ్గురు వైద్య రంగంలో సేవలందిస్తున్నారు. తాత డాక్టర్ గుత్తి సుబ్రహ్మణ్యం శస్త్రచికిత్స నిపుణులు కాగా, తల్లి డాక్టర్ సుధారాణి స్త్రీల వైద్యంలో, తండ్రి డాక్టర్ కోటేశ్వరరావు ఈఎన్‌టీ విభాగాల్లో నిపుణులుగా ఉన్నారు.)
చైతన్యసింధు, మొదటి ర్యాంకు, తెనాలి
న్యూరో సర్జన్‌గా సేవలందిస్తా
లక్ష్యాన్ని నిర్దేశించుకొని చిన్నప్పటి నుంచి ప్రణాళిక ప్రకారం చదివా. అందుకే నీట్, ఎంసెట్‌లో మంచి ర్యాంకులు వచ్చాయి. తల్లిదండ్రులు, అధ్యాపకులు వెన్నుతట్టి ప్రోత్సహించారు. న్యూరో సర్జన్‌గా సేవలందించాలనేది నా లక్ష్యం. (త్రిషా తండ్రి బీఆర్‌ఎన్‌రెడ్డి స్థిరాస్తి వ్యాపారి కాగా.. తల్లి ప్రైవేటు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.)
బి.సాయిత్రిషారెడ్డి, 2వ ర్యాంకు, సంగారెడ్డి జిల్లా
ఎంతో ఆనందంగా ఉంది
తెలంగాణ ఎంసెట్‌లో 3వ ర్యాంకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. నీట్‌లో 3వ ర్యాంకు వచ్చింది. దిల్లీ ఎయిమ్స్‌లో చేరుతున్నా. మా నాన్న 20 ఏళ్ల క్రితం దిల్లీ ఎయిమ్స్‌లోనే పీజీ చేశారు. ఇప్పుడు నేను అక్కడే చేరబోతుండటం గర్వంగా ఉంది. (స్నికిత తండ్రి సదానందరెడ్డి హృద్రోగ నిపుణులు, అమ్మ లక్ష్మీరెడ్డి గైనకాలజిస్టు)
తుమ్మల స్నికిత, 3వ ర్యాంకు, హైదరాబాద్
పేదలకు మంచి వైద్యం అందిస్తా...
మా తాత డాక్టర్ సామినేని రాఘవులు స్ఫూర్తితో నేను కూడా డాక్టర్ కావాలనుకుంటున్నా. ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీలో కార్డియాలజీ చేయాలని ఉంది. గుండె జబ్బులతో బాధపడుతున్న పేద ప్రజలకు మంచి వైద్యం అందించాలనేది నా లక్ష్యం.
ఎం.రుషిత్, 5వ ర్యాంకు (నీట్‌లో 33వ ర్యాంకు)