Neera Cafe in Hyderabad: నీరా.! గ్రామీణ ప్రాంతాల వారికిది సర్వసాధారణమే. కానీ, హైదరబాద్ వాసులకు మాత్రం ఇది కొత్త అనే చెప్పొచ్చు. అలాంటి వారికి నీరాను పరిచయం చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. అందుకు ప్రశాంతమైన హుస్సేన్ సాగర్ తీరాన్ని అనువైన ప్రాంతంగా భావించిన సర్కారు.. రూ.13 కోట్ల వ్యయంతో అత్యంత ఆకర్షణీయంగా నీరా కేఫ్‌ను ఏర్పాటు చేసింది. దీనిని గ్రామీణ వాతావరణానికి ఏ మాత్రం తీసిపోకుండా నిర్మించారు.
అచ్చం గ్రామీణ వాతావరణాన్ని సృష్టించారు: పైకప్పును తాటాకు ఆకారంలో తీర్చిదిద్దారు. కేఫ్ చుట్టూ తాటి చెట్ల నమూనాను ఏర్పాటు చేసి.. కేఫ్‌లో కూర్చున్న వారికి పొలాల్లో కల్లు తాగే అనుభూతిని పంచేలా చర్యలు తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కల్లు సేవించే ప్రాంతాన్ని మండువా అంటారు. అచ్చం అలాంటి ఏర్పాట్లే ఇక్కడ చేశారు. గ్రామాల్లో తాళ్లు, ఈదుల్లో కూర్చొని కళ్లు తాగిన అనుభూతి పొందేందుకు.. తాటి, ఈత మొద్దుల నమూనాల్లో సీట్లను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కేఫ్ చుట్టూ తాటి చెట్లు.. వాటికి మట్టి కుండలు కట్టి అచ్చం గ్రామీణ వాతావరణాన్ని సృష్టించారు.
గౌడ కులస్థులకు తాటి, ఈత చెట్ల నుంచి కల్లు సేకరించడం.. దానిని విక్రయించడం ప్రధాన జీవనాధారం. అందులో భాగంగా నీరాను కూడా తీస్తారు. తాటి, ఈత, కొబ్బరి చెట్లతో పాటు.. ఖర్జూర, జీలుగ చెట్ల నుంచి నీరాను సేకరిస్తారు. సాధారణంగా.. తాటి, ఈత చెట్లకు.. కొంత నీరు, మడ్డి కలిపిన కుండను చెట్టుకు కట్టడం వల్ల కల్లు వస్తుంది. నీరాను మాత్రం కొత్తకుండలో ఎలాంటి నీరు.. మడ్డీ వేయకుండా తాజాగా తయారు చేస్తారు.
నీరాకు తక్కువ షెల్ఫ్ లైఫ్: నీరాకు తక్కువ షెల్ఫ్ లైఫ్ ఉటుంది. 4 డిగ్రీల వద్ద ఉంచితే.. ఇది ఐదు రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇప్పటి వరకు కంబోడియా, ఆఫ్రికా, ఇండోనేషియా, మలేషియా, శ్రీలంక వంటి దేశాల్లో నీరా ఉత్పత్తి అధికంగా ఉంది. ప్రస్తుతం తెలంగాణాలో కూడా ఆస్థాయికి నీరా ఉత్పత్తి చేరుకుంటుందని భావిస్తున్నారు. ఏ చెట్టు నుంచి తయారు చేసిన నీరా అయినా అద్భుతమైన రుచితో పాటు.. అందులో పోషకాలు కూడా ఉంటాయని గౌడ కులస్తులు పేర్కొంటున్నారు.
నీరా.. మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, ప్రొటీన్, షుగర్, విటమిన్-సి కలిగి ఉంటుందని.. ఇది శాస్త్రీయంగా కూడా నిరూపితమైందని వారు అభిప్రాయపడుతున్నారు. వ్యాధులను నివారించే ఔషధ గుణాలు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయని అధ్యయనాల్లో తేలినట్లు చెబుతున్నారు. ఇది శరీర అంతర్గత ప్రక్షాళన చేసే యంత్రాంగాన్ని మెరుగుపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉందని, షుగర్, కాలేయం, గుండె సమస్యల వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుందని అంటున్నారు.
నీరాలో అనేక ఔషధ గుణాలు: నీరాలో అనేక ఔషధ గుణాలు ఉంటాయని శాస్త్రవేత్తల పరిశోధనలు కూడా తెలిపాయి. కేన్సర్ సహా 18 అనారోగ్య సమస్యలకు నీరా పరిష్కారం చూపుతుందని గౌడ కులస్థులు తెలిపారు. నెక్లెస్ రోడ్ ఏర్పాటు చేసిన కేఫ్‌కు రాష్ట్రంలోని 4 ప్రధాన కేంద్రాల నుంచి నీరాను సేకరించనున్నట్లు వారు చెబుతున్నారు. చెట్ల నుంచి వేకువజామునే లభించే నీరాను రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు తీసుకువస్తారు.
కేఫ్‌లో అన్ని రకాల వసతులు కల్పించిన నిర్వాహకులు: దానిని ప్రాసెస్ చేసేలా కేఫ్‌లో పలు యంత్రాలను అమర్చారు. అనంతరం నీరాను ప్యాకేట్, బాటిళ్ల రూపంలో విక్రయించేలా ఏర్పాట్లు చేశారు. ఆ ప్రాసెసింగ్ యూనిట్‌ను.. దాని పనివిధానాన్ని ఓసారి పరిశీలించండి. రూ. 13 కోట్లతో నిర్మించిన నీరా కేఫ్‌లో అన్ని రకాల వసతులు కల్పించారు. ఇందులో ఒకేసారి 300నుంచి 500 మంది కూర్చుని నీరాను సేవించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
నీరాతో పాటు వాటి అనుబంధ ఉత్పత్తుల విక్రయం: పార్శిల్ తీసుకువెళ్లే వారికోసం ప్రత్యేక కౌంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. నీరా కేఫ్‌లో 7 స్టాళ్లను అందుబాటులో ఉంచారు. ఇందులో నీరాతో పాటు వాటి అనుబంధ ఉత్పత్తులు కూడా విక్రయించనున్నారు. తెలంగాణ వంటలు, గుడాలు, కారా, తలకాయ, చికెన్, పాయ వంటి వంటలు కూడా అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నీరా కేఫ్ నుంచి ట్యాంక్‌బండ్‌లోని బుద్ధ విగ్రహం వరకు బోటింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
బోటింగ్ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు: ఇక్కడికి వచ్చిన వాళ్లు బోటింగ్ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు కూడా చేశారు. తెలంగాణ ఎక్సైజ్ పాలసీ ప్రకారం ఈ స్టాల్స్‌ను నడపడానికి, నీరా ఉత్పత్తి, విక్రయాల కోసం లైసెన్సులను ప్రస్తుతం గౌడ సంఘం సభ్యులకు మాత్రమే ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ప్రకృతి ప్రసాదితమైన నీరాకు బ్రాండ్ తీసుకొస్తే.. గౌడ కులవృత్తి పరిశ్రమ స్థాయికి ఎదుగుతుందని గౌడకులస్తులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో.. నీరా కేఫ్‌ను ప్రతిష్టత్మకంగా నిర్మించినట్లు గౌడకులస్తులు పేర్కొంటున్నారు.
పల్లెలకే పరిమితమైన నీరాను నగర వాసులకు పరిచయం చేసేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రధానంగా నీరా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. వాటన్నింటిని ప్రజలకు అందించాలనే లక్ష్యంతో నీరా కేఫ్‌ను ఏర్పాటు చేయడం పట్ల నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నీరా కేఫ్ పనులు దాదాపు పూర్తవ్వగా అతి త్వరలోనే ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
"ఒక ఆరోగ్యకరమైన డ్రింక్‌ను తరతరాల నుంచి వచ్చిన నీరాను అందించనున్నాం. ఆరోగ్యకరమైన డ్రింక్‌ను అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ కేఫ్‌ను ఏర్పాటు చేశాం." - శ్రీనివాస్ గౌడ్, అబ్కారీ శాఖ మంత్రి
ఇవీ చదవండి: రాష్ట్ర సర్కారు ప్రగతి ప్రస్థానానికి కొనసాగింపుగా.. మరోమారు భారీ బడ్జెట్
60 చదరపు అడుగుల దుకాణం ఖరీదు రూ.1.72కోట్లు.. అంత ధర ఎందుకంటే..