‘తప్పు’ సరిదిద్దుకోవాల్సిన హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) అధికారులు చోద్యం చూస్తున్నారు. 10 వేల వరకు తప్పులు దొర్లిన బృహత్తర ప్రణాళిక (మాస్టర్ ప్లాన్-2031)ను సరిదిద్దకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. దానినే ప్రామాణికంగా తీసుకుంటుండటంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.
హడావుడి చేసి.. ఆఖరికి..
ప్రస్తుతం నగరాభివృద్ధికి సంబంధించి హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (హుడా), హైదరాబాద్ విమానాశ్రయాభివృద్ధి సంస్థ(హడా), సైబరాబాద్ అభివృద్ధి సంస్థ(సీడీఏ), మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్(ఎంసీహెచ్), హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ)-2031 ప్రణాళికలు అమల్లో ఉన్నాయి. ఒక్కో దాంట్లో ఒక్కోలా నిబంధనలున్నాయి. సమీకృత విధానం లేదు. రెండు, మూడింటి గడువు త్వరలో ముగియనుంది. అభివృద్ధి ప్రాజెక్టులను పట్టాలెక్కించే క్రమంలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ తరుణంలో 2041 అవసరాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ఏకీకృత బృహత్తర ప్రణాళికను రూపొందించే బాధ్యతను ప్రభుత్వం హెచ్‌ఎండీఏకు అప్పగించింది. నాలుగేళ్ల కింద హెచ్‌ఎండీఏ ముసాయిదాను రూపొందించి సమర్పించింది. పురపాలక శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి మోకాలడ్డటంతో అడుగు ముందుకు పడలేదు.
అదేంటి అక్కడ రోడ్డు ఉంది కదా..?
క్షేతస్థాయిలో పర్యటించకుండానే మాస్టర్ ప్లాన్-2031ను రూపొందించారు. 2013లో అందుబాటులోకొచ్చిన ఈ ప్రణాళికలో పది వేల వరకు తప్పులున్నట్లు హెచ్‌ఎండీఏ అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి తేల్చారు. కొన్ని ప్రాంతాల్లో చెరువులు చూపించలేదు. మరికొన్ని గ్రామాల్లో కొన్ని సర్వే నంబర్లను పేర్కొనలేదు. ఏకీకృత ప్రణాళికను పక్కన పెట్టడంతో ఈ తప్పులను సరిదిద్దాలని నిర్ణయించారు. అందుకు రెండేళ్ల కింద కసరత్తు చేశారు. కానీ మార్పులు చేయకుండానే చేతులెత్తేశారు. ఈ ప్రణాళికను ప్రామాణికంగా తీసుకుని భవనాలు, లేఅవుట్లకు అనుమతులు జారీ చేస్తున్నారు. కొంత కాలం కింద భవన నిర్మాణానికి అనుమతివ్వాలని ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకోగా సర్వే నంబర్లలో రోడ్డు వెళ్తుందంటూ సంబంధిత అధికారులు చెప్పడంతో దరఖాస్తుదారు కంగుతిన్నాడు. చుట్టూ భవనాలున్నాయని, రోడ్డు ఎలా వేశారని ప్రశ్నించాడు.