ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం రుషికొండ సముద్ర తీరానికి రెండు కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 30 అడుగుల లోతున సహజ శిలాతోరణాన్ని అన్వేషకులు గుర్తించారు. భారీ శిల మధ్య నుంచి గుహలా ఇవి ఏర్పడినట్లు వారు చెప్పారు. విశాఖకు చెందిన 'లివ్‌ఇన్ అడ్వంచర్'కు చెందిన స్కూబా డైవర్లు సముద్ర గర్భంలో తరచూ కొత్త ప్రాంతాల అన్వేషణ చేస్తుంటారు. ఇందులో భాగంగా నిర్వాహకులు బలరాంనాయుడితో కూడిన నలుగురి బృందం గతంలో ఎప్పుడూ చూడని శిలలతో కూడిన తోరణం లాంటి ఆకారాన్ని గుర్తించింది.
సుమారు 45 నిమిషాల పాటు అన్వేషకులు సముద్ర గర్భంలో ఉండి ఆ పరిసరాలను రికార్డు చేశారు. ఇది ప్రస్తుతం విశాఖలోని మంగమారిపేట సముద్ర తీరంలోని శిలాతోరణాన్ని పోలి ఉండడం గమనార్హం. కొన్ని వేల సంవత్సరాలు సముద్రంలోని కొండ అలల తాకిడికి అలా మారి ఉంటుందని బృంద సభ్యులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఆ పాఠశాలల్లో నియమాలు కఠినం.. కరోనాకు దూరం!