వ్యవసాయ రంగంలో భవిష్యత్తు సవాళ్ల దృష్ట్యా పాఠ్యప్రణాళికల్లో ఎప్పటికప్పుడు తగిన మార్పులు చేస్తున్నామని భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్‌సీ అగర్వాల్ అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి, అఖిల భారత వ్యవసాయ విద్యార్థుల సంఘం సంయుక్తంగా వర్చువల్ పద్ధతిలో రెండు రోజులపాటు జరగనున్న 6వ నేషనల్ యూత్ కన్వెన్షన్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. వ్యవసాయ విద్యార్థులను స్వయం ఉపాధితోపాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ విద్యలో చేరుతున్న విద్యార్థుల ప్రతిభను గుర్తించి సరైన మార్గదర్శనం ఇచ్చేలా అధ్యాపకులు కృషి చేయడంతోపాటు వ్యాపార రంగం వైపు మళ్లించేందుకు ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులు కూడా భవిష్యత్తు సవాళ్లు, అవకాశాలు అందిపుచ్చుకునే తయారవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
విద్యార్థులు గర్వపడాలి..
సహజ సుస్థిరత వ్యవసాయంతోనే సాధ్యపడుతుందని నేషనల్ రెయిన్‌ఫెడ్ అథారిటీ సీఈఓ డాక్టర్ అశోక్ దళ్లాయి అన్నారు. బేసిక్ సైన్సెస్‌పై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని, అన్ని విశ్వవిద్యాలయాలు బేసిక్ సైన్సెస్‌లో కోర్సులు ప్రారంభించాలని సూచించారు. అగ్రికల్చర్ అంటే ఎవర్‌గ్రీన్ ఎకనామిక్ సబ్జెక్ట్ అని... ఈ రంగంలో ఉన్నందుకు విద్యార్థులు గర్వపడాలని ఆయన చెప్పారు. కొవిడ్-19 నేపథ్యంలో మారిన పరిస్థితుల్లో వ్యవసాయ రంగంలో అనేక సవాళ్లతోపాటు అవకాశాలు ఉన్నాయని... అవి విద్యార్థులు అందిపుచ్చుకోవాలని ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీ ఉపకులపతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు అన్నారు. వ్యవసాయంలో ఆధునిక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవకాశాలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా అనలిటెక్స్, రోబోటిక్స్ వంటి సాంకేతిక విజ్ఞానం విరివిగా ఉపయోగించుకోవాలని సూచించారు.
పురస్కారాలు
ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థుల సంఘం పలు పురస్కారాలు అందజేసింది. జీవిత సాఫల్య పురస్కారం పంజాబ్‌రావు దేశ్‌ముఖ్ కృషి విద్యా పీఠ్ ఉపకులపతి డాక్టర్ విలాస్ మధుకర్ భాలేకు అందజేశారు. ప్రతిష్టాత్మక లీడర్‌షిప్ జాతీయ పురస్కారాన్ని కర్నాల్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వీట్ అండ్ బార్లీ పరిశోధన స్థానం డైరెక్టర్ డాక్టర్ జీపీ సింగ్ అందపుకున్నారు. ఉత్తమ ఉపకులపతిగా తమిళనాడు వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎన్.కుమార్ అందపుకున్నారు. ఈ కార్యక్రమంలో పలు పుస్తకాలు ఆవిష్కరించారు.
ఇదీ చదవండి: సీఎం కేసీఆర్ కృషితో దేవాలయాల అభివృద్ధి: ఇంద్రకరణ్ రెడ్డి