National Statistics Day 2023 : హైదరాబాద్‌లోని జాతీయ నమూనా సర్వే ప్రాంతీయ కార్యాలయంలో గణాంక దినోత్సవం విజయవంతంగా జరిగింది. తొలుత ఈ కార్యక్రమాన్ని నేషనల్ శాంపిల్ సర్వే రాష్ట్ర ప్రధాన కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డి.సతీష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గణాంక శాస్త్ర నిపుణులు డాక్టర్ ఎన్.భాత్రాచార్యులు, సెన్సెక్స్ ఆపరేషన్స్ డైరెక్టరేట్ కార్యనిర్వాహక అధికారి గుంజి ప్రసన్నకుమార్, ఎన్‌ఎస్‌ఎస్‌ఓ డిప్యూటీ డైరెక్టర్ శివపార్వతి, అసిస్టెంట్ డైరెక్టర్ రావికంటి జయరామ్ తదితరులు పాల్గొన్నారు.
National Statistics Day Celebrations in Hyderabad : "సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు పర్యవేక్షించడానికి జాతీయ సూచిక విధానాలతో రాష్ట్రాల సూచిక విధానాలను ఏకీకృతం చేయడం" అనే ఇతివృత్తి నేపథ్యంలో ఈ సంవత్సరం థీమ్.. 'సుస్థిర అభివృద్ధి కోసం డేటా' అంశంపై విస్తృతంగా చర్చించారు. దేశంలో పలు విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ, పీజీలో కూడా స్టాటిస్టిక్స్ కోర్సు కూడా ఉన్న దృష్ట్యా.. "ఎవరైనా విద్యార్థులు ఆ కోర్సులు పూర్తి చేసి పట్టాలు చేతబుచ్చుకుంటే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా డేటా సైన్సుకు మంచి డిమాండ్ ఉంది.
తెలంగాణలో ఉస్మానియా వర్సిటీలో స్టాటిస్టిక్స్, కంప్యూటర్ అప్లికేషన్‌తో ఎంఎస్‌సీ డేటా సైన్స్ ప్రవేశపెట్టింది సర్కారు. కంప్యూటర్ అప్లికేషన్స్, ప్రోగ్రామింగ్స్‌తో స్టాటిస్టిక్స్ సాఫ్ట్‌వేర్స్ ఉపయోగించుంటే బహుళ జాతి కంపెనీల్లో పట్టభద్రుల సాంకేతిక నైపుణ్యాలు, ప్రతిభా పాటవాలు బట్టి ఆకర్షణీయమైన వేతనాలతో కూడిన మంచి కొలువులు" లభిస్తున్నాయని నిపుణులు వెల్లడించారు.
"మిలియన్ల కొద్ది ఉపాధి అవకాశాలు డేటా సైన్స్‌లో ఉన్నాయి. అందులో ముఖ్యంగా స్టాటిస్టిక్స్‌పై మంచి అవగాహన ఉంటే జాబ్స్‌కు కొదువ లేదు. ప్రైవేట్, గవర్నమెంట్ సెక్టార్లో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవాలి".- ప్రొఫెసర్ ఎన్.భాత్రాచార్యులు, ప్రముఖ గణాంక నిపుణులు
దేశంలో గణాంక, ఆర్థిక ప్రణాళిక రంగాల్లో దివంగత ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహలనోబిస్ చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం జూన్ 29న ఆయన జయంతికి అనుబంధంగా భారత ప్రభుత్వం జాతీయ స్థాయిలో "గణాంక దినోత్సవం"గా ప్రకటించింది. సామాజిక, ఆర్థిక, ప్రణాళిక, విధాన రూపకల్పనలో గణాంకశాస్త్రం పాత్ర, ప్రాముఖ్యత గురించి మహలనోబిస్ నుంచి ప్రేరణ పొందడానికి ప్రత్యేకించి యువతరంలో ప్రజా అవగాహన కల్పించడం ఈ దినోత్సవం లక్ష్యం.
National Sample Survey : ఈ సందర్భంగా "సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-జాతీయ సూచిక విధానాలు, ప్రగతి నివేదిక - 2023 ఆవిష్కరించారు. నివేదికతోపాటు "సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-జాతీయ సూచిక విధానాలు, 2023" డేటా స్నాప్‌షాట్ కూడా విడుదల చేశారు.
"నేషనల్ శాపింల్ సర్వే ఎలా పని చేస్తోందో మేం తెలుసుకున్నాం. రోజువారీ జీవితంలో గణాంకాలు ఎలా ఉపయోగపడుతాయో గ్రహించాం. స్టాటిస్టిక్స్ కోర్సులు, పరీక్షలు, వాటిలో మార్కులు సాధించడం గురించి నిర్వాహకులు వివరించారు."-కె.ప్రవల్లిక, ఆర్‌బీవీఆర్ మహిళా కళాశాల
ఇవీ చదవండి: