KCR ON BRS: 75 ఏళ్లుగా ఏలిన పార్టీలు దేశానికి చేసిందేమీ లేదని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఇతర పార్టీలకు రాజకీయాలు ఆట.. తెరాసకు టాస్క్ అని అన్నారు. తెలంగాణ కోసం కష్టపడినట్లే దేశం కోసం పనిచేద్దామని పేర్కొన్నారు. జాతీయ పార్టీ పెట్టాలన్నది ఆషామాషీ నిర్ణయం కాదని తెలిపారు. బలమైన పునాదుల పైనుంచే జాతీయ పార్టీ నిర్ణయమని స్పష్టం చేశారు. కుల, లింగ వివక్షలు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు.
మహిళలు, దళితులు అభివృద్ధిలో భాగస్వామ్యం కాలేకపోతున్నారని కేసీఆర్ చెప్పారు. ప్రత్యేకంగా దళిత జనోద్దరణకోసం అమలు చేస్తున్న కార్యక్రమం దళితబంధు అని అన్నారు. భారత రాజకీయ రంగాన్ని ప్రభావితం చేసేందుకే జాతీయ పార్టీతో ముందడుగు వేశామని వెల్లడించారు. దేశ ప్రజల సమస్యలనే ఎజెండాగా జాతీయ పార్టీ జెండాతో వెళ్తున్నామని చెప్పారు. అఖిలేశ్, తేజస్వి యాదవ్ కూడా వస్తామన్నారు. కానీ తానే వద్దని చెప్పానని కేసీఆర్ పేర్కొన్నారు.
తమతో కలిసి ముందుకు సాగడానికి దేశవ్యాప్తంగా అనేక పార్టీల నేతలు ముందుకొస్తున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి మాజీ ప్రధాని దేవెగౌడ గట్టి మద్దతునిచ్చారని గుర్తు చేశారు. తమకు జేడీఎస్ సంపూర్ణ మద్దతుంటుందని దేవెగౌడ స్పష్టం చేశారని తెలిపారు. జాతీయపార్టీలో ఆర్థిక శాస్త్రవేత్తలు, పలు రంగాల నిపుణలతో అనేక చర్చలు జరిపామని కేసీఆర్ తెలియజేశారు.
బీఆర్ఎస్ మొదటి కార్యక్షేత్రం మహారాష్ట్ర అని కేసీఆర్ వివరించారు. బీఆర్ఎస్ అనుబంధ రైతు సంఘటన మహారాష్ట్ర నుంచే ప్రారంభిస్తామని చెప్పారు. దళిత, రైతు, గిరిజన ఉద్యమం ప్రధాన అజెండాగా ముందుకు సాగుతామని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: తెలంగాణ రాష్ట్ర సమితి.. ఇకపై భారత్ రాష్ట్ర సమితి
అంబానీ కుటుంబానికి మరో బెదిరింపు కాల్.. ఫ్యామిలీ మెంబర్ల పేర్లు చెప్పి మరీ..