తెలంగాణ రాష్ట్రం త్వరలోనే క్రీడా హబ్‌గా మారబోతోందని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి అన్నారు. తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ, తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ సంయుక్తంగా హైదరాబాద్‌లో ఐదు రోజుల పాటు జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో నేషనల్ ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీని ఆయన ఆవిష్కరించారు.
ఈనెల 27 నుంచి 31 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ప్లేగ్రౌండ్‌లో నేషనల్ ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్-2020 పోటీలు నిర్వహిస్తున్నట్లు వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా దాదాపు 700 మంది బాలబాలికలతో పాటు, 200 మంది ఉన్నతాధికారులు పాల్గొంటారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆయన త్వరలోనే క్రీడా పాలసీని తీసుకొస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన పలువురు క్రీడకారులు జాతీయ స్థాయిలో అద్భుతంగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. త్వరలోనే జాతీయ స్థాయి క్రీడ పోటీలతో పాటు అంతర్జాతీయ స్థాయి క్రీడ పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'శ్రీవల్లి రష్మికకు అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తాం'