రుణమాఫీ పథకం కింద రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేసేందుకు అవరోధాలు తొలగాయి. ఆన్‌లైన్‌లో రైతుల వివరాల పరిశీలనకు సంబంధించిన జాతీయ సమాచార కేంద్రం(ఎన్‌ఐసీ) కంప్యూటర్ సర్వర్ సామర్థ్యాన్ని మంగళవారం పెంచారు. ఈ సాంకేతిక సమస్య పరిష్కారం కావడంతో ఇక సొమ్మును నాలుగైదు రోజుల్లో వేగంగా జమ చేయడానికి వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది.
తొలిదశ..
2018 డిసెంబరు 11 నాటికి బ్యాంకుల్లో రూ.25 వేలలోపు రుణబకాయి ఉన్న రైతులకు తొలిదశ కింద సొమ్ము జమ చేస్తున్నారు. వీరికోసం రూ.1210 కోట్లను ప్రభుత్వం వ్యవసాయశాఖకు ఇచ్చింది. ఇప్పటివరకూ 1.96 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.299 కోట్లను వేశారు. మిగిలిన వారికి వేయడానికి ఒక్కో రైతు కుటుంబ సభ్యుల బకాయిల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో పరిశీలిస్తున్నారు. రైతు, అతని భార్య, పిల్లల పేరిట ఉన్న మొత్తం రుణం రూ.25 వేలలోపు ఉంటే వారికి తొలిదశలో డబ్బు జమ అవుతుంది.
వివరాలు ఇవ్వకుంటే...
దీనికోసం రైతు కుటుంబసభ్యుల ఆధార్ వివరాలన్నీ పక్కాగా ఉన్నవారికి తొలుత వేస్తున్నారు. కొందరు రైతులు తమ కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలను అందజేయలేదు. వారివి పక్కనపెట్టారు. ఆ రైతుల నుంచి ఆధార్ వివరాలను సేకరించాలని వ్యవసాయాధికారులను వ్యవసాయశాఖ ఆదేశించింది. ఆన్‌లైన్‌లోని రైతుల వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారుల(ఏఈవో)లకు విడుదల చేయనున్నారు. వారు ఆన్‌లైన్‌లో గ్రామం వారీగా పరిశీలించి ఆధార్‌లేని వివరాలను వెంటనే నమోదు చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఆ రైతుల ఖాతాల్లో సొమ్మును జమచేస్తారు. రూ.25వేలకు పైబడి రూ.లక్షలోపు బకాయి ఉన్న రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో తరవాత పరిశీలిస్తారు. రాష్ట్రంలో మొత్తం 40లక్షల మంది రైతులకు 2018 డిసెంబరు నాటికి రూ.లక్షలోపు బకాయిలున్నట్లు అంచనా.
ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 42 కరోనా పాజిటివ్ కేసులు.. నలుగురు మృతి