Sleeping In Office : అధికారులు క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించడంలేదని, కార్యాలయాల్లో నిద్రపోతున్నారని... మైనింగ్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులపై చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమంగా కంకర మిల్లులు నడుస్తున్న సంగతి తెలిసినా పట్టించుకోవడంలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. తాము ఆదేశాలిస్తేనే తనిఖీలు ప్రారంభించి చర్యలు చేపడుతున్నారంది. రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల శివారు ప్రాంతాల్లో అనుమతుల్లేకుండా కంకర మిల్లులు నిర్వహిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై ఎన్జీటీ జ్యుడిషియల్ సభ్యులు జస్టిస్ కె.రామకృష్ణన్, సాంకేతిక సభ్యులు డాక్టర్ కె.సత్యగోపాల్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ స్పందిస్తూ ఇదే అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైందన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ పీసీబీ అధికారులు అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయడంలేదని ప్రశ్నించింది. చర్యలు తీసుకోవడమంటే విద్యుత్తు కనెక్షన్లు తొలగించామని చెప్పడం కాదంది. జనరేటర్లతో రాత్రింబవళ్లు మిల్లులను నడిపిస్తున్నా పట్టించుకోవడంలేదంది. ఎన్జీటీ నిపుణుల కమిటీ నివేదిక వచ్చాక పరిశీలిస్తామంటూ విచారణను మార్చి 31కి వాయిదా వేసింది. మైనింగ్, పీసీబీ అధికారులు శాఖాపరమైన నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. కంకర మిల్లుల యజమానులకు తాజాగా నోటీసులు జారీ చేసింది.
ఇదీ చూడండి : 'ప్రపంచమే అబ్బురపడేలా నూతన సచివాలయ నిర్మాణం..'