national flags distribution in Telangana: 75 ఏళ్ల స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను రాష్ట్రప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా త్రివర్ణ పతాకాలు ప్రజలకు అందించనుంది. ఇప్పటికే చేనేత, పవర్ లూమ్ కార్మికుల ద్వారా తయారు చేయించిన తిరంగా జెండాలను జిల్లా కలెక్టర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నారు. పట్టణాల్లో పురపాలక శాఖ, గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ ద్వారా త్రివర్ణపతాకాలను అందించనున్నారు. జాతీయ జెండాల పంపిణీ కోసం రెండు శాఖలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాయి. గ్రామాల్లో ప్రతి వంద ఇళ్లకు ఒకరు చొప్పున అధికారులు, సిబ్బందిని కేటాయించిన పంచాయతీరాజ్ శాఖ.. ప్రతి ఐదు గ్రామ పంచాయతీలకు ఒకరికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. పంపిణీకి ప్రభుత్వం 14 వరకు గడువిచ్చింది.
సింగరేణి వ్యాప్తంగా ఇంటింటిపై జాతీయ జెండా ఎగురవేసేలా ఉద్యోగులు, పొరుగు సేవల సిబ్బందిని ప్రోత్సహించాలని సంస్థ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. సింగరేణి భవన్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహణపై సమీక్షించిన అధికారులు.. 70 వేల త్రివర్ణ పతాకాలను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 10 నాటికి సింగరేణి వ్యాప్తంగా జాతీయ జెండాలు పంపిణీ చేయాలని ఆదేశించారు.
వారికి 12 ఏళ్లు ఉచిత ప్రయాణం.. మరోవైపు ఆగస్టు 15న జన్మించిన చిన్నారులందరికీ.. వారికి 12 ఏళ్లు పూర్తయ్యే వరకూ రాష్ట్రంలోని అన్ని సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను చాటిచెప్పేలా హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్ వంటి పెద్ద బస్ స్టేషన్లలో లఘు చిత్రాలను ప్రదర్శించనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ నెల 13న నెక్లెస్ రోడ్డులో ఉద్యోగులతో పరేడ్ నిర్వహించనున్నారు. ఆగస్ట్ 15న 75 ఏళ్లు దాటిన వృద్ధులకు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. ఆగస్టు 18న రక్తదాన శిబిరం నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 15 నుంచి 22 వరకు 75 ఏళ్లు దాటిన వృద్ధులకు తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో ఉచిత హెల్త్ చెకప్‌తో పాటు మందులను అందించనున్నారు.
దేదీప్యమానంగా ఆలయాలు..: ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా హనుమకొండలోని వేయి స్తంభాల ఆలయం త్రివర్ణ రంగులతో కూడిన విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా మెరిసిపోతోంది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని చారిత్రక రామప్ప దేవాలయం త్రివర్ణ శోభను సంతరించుకుంది.