‘దక్షస్తీర్థాత్త శాస్త్రార్థో దృష్టకర్మా సుచిర్భిషక్..’
అంటూ భిషక్ (వైద్యుడి)కి ఉండాల్సిన నాలుగు లక్షణాల్ని అష్టాంగ హృదయంలో పేర్కొంటాడు వాగ్భటుడు. వాటిలో మొదటిది దక్షత. అంటే ఎంత సవాలుతో కూడుకున్న పరిస్థితి ఎదురైనా సమర్థంగా ఎదుర్కోగలగటం. తీర్థాత్త శాస్త్రార్థం అంటే.. సరైన జ్ఞానం కలిగిన గురువు నుంచి శాస్త్ర అర్థాన్ని తెలుసుకుని ఉండటం. దృష్టకర్మ అంటే రోగానికి స్వయంగా వైద్యం చేసిన అనుభవం గడించి ఉండాలి. ఇక నాలుగోది, చాలా ప్రధానమైంది.. శుచి. అంటే శారీరక శుభ్రతతో పాటు మనసు కూడా శుచిగా ఉండటం. పవిత్రత. వైద్యుడు రజో, తమో గుణాలని దగ్గరికి రానివ్వకూడదు. అలా ఉండటం వల్ల, చేసే వైద్యానికి ఈశ్వర తత్వం వస్తుంది. ఎలాంటి రోగాన్నైనా తేలిగ్గా నయం చేయగల లక్షణం ఆ వైద్యానికి అందుతుంది.
- ఆయుర్వేదానికి మూలం సాంఖ్య, యోగ లాంటి దర్శన శాస్త్రాలు. యోగ దర్శన యమ నియమాల్లో ‘శౌచ సంతోష తపస్సాధ్యాయ ఈశ్వరప్రణిధానాని నియమాః’ అని ఉంటుంది. ఆయుర్వేదంలో శౌచాన్ని ఇక్కడి నుంచే తీసుకున్నారు. దీనికి విస్తృత వివరణ ఇక్కడ కనిపిస్తుంది. శౌచం గురించి ‘తత్వశుద్ధి సౌమనస్య ఇంద్రియజయ ఆత్మదర్శన యోగ్యతాంచ’ అని యోగ దర్శనం పేర్కొంటుంది. శౌచం అంటే బహిరంతర్గత శుచిత్వం. శౌచం వల్ల తత్వశుద్ధి, సౌమనస్యం (మనసు సంతోషంగా ఉండటం), ఇంద్రియ జయం, ఆత్మదర్శన యోగ్యత కలుగుతాయి. శౌచం అనేది సత్వగుణ బాహుళ్యం. వైద్యులకు ప్రధానంగా ఉండాల్సింది ఇదే.
గొప్ప పుణ్యం
నార్థార్థం నాపి కామార్థ మథ భూత దయాం ప్రతి
వర్తతే యశ్చికిత్సాయాం స సర్వమతివర్తతే
కుర్వతే యే తు వృత్త్యర్థం చికిత్సా పణ్యవిక్రయమ్
తే హిత్వా కాంచనం రాశిం పాంశురాశి ముపాసతే
అంటుంది చరక సంహిత. మంచి వైద్యుడు కేవలం డబ్బు కోసమో, లేదంటే స్వార్థం కోసమో వైద్యం చెయ్యకూడదు. సకల భూతదయతో వైద్యం చేసే వ్యక్తి అన్నిటినీ అధిగమించి అంత్య కాలంలో మోక్షం పొందుతాడని చెబుతాడు చరకుడు. అలా కాకుండా కేవలం ధనం వెంటే పరుగులు పెడుతుంటే.. వైద్యం చెయ్యడం ద్వారా వచ్చే గొప్ప పుణ్యం అనే బంగారు రాశిని విడిచిపెట్టి బూడిద రాశిని పట్టుకున్నట్లు అవుతుందని అంటుంది చరక సంహిత.
- ‘ధర్మార్థదాతా సదృశస్తస్య నేహోపలభ్యతే/ నహి జీవిత దానాద్హి దానమన్యద్వి శిష్యతే’ అన్నారు పెద్దలు. అంటే, ఒక మనిషికి జీవితం ఇవ్వటం కన్నా గొప్పదానం మరొకటి లేదు. అది వైద్యుడి చేతిలో ఉంది. అంత గొప్ప వృత్తిని కాసుల సంపాదనే లక్ష్యంగా కొనసాగించటం ఎంతవరకు సమంజసం?
వృథాకాదు
‘క్వచిత్ అర్థం క్వచిత్ ధర్మం క్వచిత్ మైత్రి క్వచిత్ యశః కర్మాభ్యాసం క్వచిత్‌చైవ చికిత్సా నాస్తి నిష్ఫలా’ అంటూ సుశ్రుత సంహిత కేవలం ధనమే ఆశించకుండా మంచి మనసుతో చేసే చికిత్స వల్ల చాలా ప్రయోజనాలుంటాయని చెబుతుంది. మంచి వాళ్లకి, అవసరంలో ఉన్నవారికి చికిత్స చెయ్యటం వల్ల మానవ ధర్మం నిలబడుతుంది. మంచి వైద్యంతో గొప్పవాళ్లు స్నేహితులవుతారు. యశస్సు పెరుగుతుంది. వైద్య విద్యార్థులు వైద్యం అందించటం ద్వారా వారికి అనుభవం వస్తుంది. జ్ఞానం పెరుగుతుంది. అందుకే, చేసిన చికిత్స ఎప్పటికీ వృథా కాదు!
అధర్మమే కారణం
వ్యాధి వస్తే వైద్యుడు చికిత్స చేస్తాడు సరే. అసలు రోగాలు ఎందుకొస్తాయి? దానికి కారణం ఏంటి? అన్నదానికి చరక సంహితలో సమాధానం దొరుకుతుంది. అందులో జనపదోధ్వంసాల గురించి చెప్పారు. విభిన్న వాతావరణాల్లో ఉంటూ విభిన్న ఆహారాలు తీసుకుంటూ వయసు, శారీరక బలం కూడా వేర్వేరుగా ఉన్న వాళ్లకి ఆయా కాలాల్లో ఆటలమ్మ, కలరా, ప్లేగు లాంటి ఒకే రకమైన జబ్బులు ఎందుకొస్తున్నాయి అన్న దాని గురించి వారు ఆలోచించారు. దీనికి సమాధానంగా మనుషుల్లో అధర్మం పెరిగితే జబ్బులొస్తాయి అంటాడు చరకుడు! ఇక్కడ అధర్మం అంటే, మనిషి ప్రకృతితో స్నేహితుడిలా జీవించాలి అన్న ధర్మాన్ని మరచి, నివశిస్తున్న భూమి, పీల్చే గాలి, తాగే నీటిని కలుషితం చేసుకోవటం. రుతుపవనాల్ని తీసుకొచ్చేది కూడా వాయువులే. వాయు కాలుష్యం వల్ల అవీ ప్రభావితం అవుతాయి. ఈ అన్ని కారణాల వల్ల మానవుల్లో బలం తగ్గి అందరికీ ఒకే రకమైన జబ్బు వచ్చే అవకాశం ఉందని విశ్లేషించాడు. ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ ప్రబలటానికి కూడా ఇదే కారణం కాదా!?
రోగాలు లేకుండా..
‘నిత్యం హితాహార విహార సేవీ సమీక్షకారీ విషయేస్వసక్తః
దాతా సమః సత్యపరః క్షమావా న్నాప్తోపసేవీ చ భవత్యరోగః’
అంటుంది చరక సంహిత. ఇందులో చికిత్సాస్థానంలో మొట్టమొదట ఏ రోగాల గురించీ చెప్పలేదు. వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పేర్కొన్నారు. రోజూ హితమైన ఆహారాన్ని తీసుకుంటూ హిత దినచర్య పాటించాలి. ఏ పని అయినా ఆలోచించి సమీక్ష చేసుకుని చెయ్యాలి. అనవసర విషయాసక్తి ఉండకూడదు. పక్కవాళ్లకి ఇచ్చేగుణం ఉండాలి. అందరినీ సమంగా చూడాలి. సత్యాన్ని ఆచరించాలి. క్షమించే గుణం ఉండాలి. ఆప్తుల సేవ చెయ్యాలి. వీటన్నింటినీ పాటించే వ్యక్తి రోగాలు లేకుండా ఉంటాడట! అంతేకదా.. ఒక అబద్ధం చెబితే దాన్ని కప్పిపుచ్చుకోవటానికి మరో పది అసత్యాలు ఆడాలి. మన్నించే గుణం లేకుండా సాటి వ్యక్తుల మీద ద్వేషం పెంచుకుంటే అది ఆరోగ్యానికి ఏమాత్రం క్షేమం కాదు!
- సత్యం, అహింస, అక్రోధం, శాంతం, శౌచం లక్షణాలు ఉన్నవాడు జబ్బులు లేకుండా ఉండగలుగుతాడని అంటాడు వాగ్భటుడు. అందుకే ప్రజలు వీటి గురించి అవగాహన పెంచుకోవాలి. ఎప్పుడైనా జబ్బులు రాకుండా చెయ్యటం చాలా ప్రధానం. దాన్ని వదిలిపెట్టి వ్యాధి వచ్చాక చికిత్స చెయ్యటం ఎలా అన్న దాని వెంటే పరుగులు తీస్తుండటం బాధాకరం!
‘అధ్యవోచదధివక్తా ప్రథమో దైవ్యో భిషక్’ అంటూ సాక్షాత్తూ పరమేశ్వరుణ్ని మొదటి వైద్యుడిగా పేర్కొన్నారు పెద్దలు. ఏదన్నా జబ్బు తగ్గాలంటే భగవంతుడి అనుగ్రహం కూడా ఉండాలి. అంటే భగవంతుడే వైద్యుడి ద్వారా చేయించాలి. అలాగే వైద్యుడి పేరు చెప్పగానే ‘వైద్యో నారాయణో హరిః’ అన్న పలుకూ ప్రధానంగా వినిపిస్తుంది. దీన్ని అసలు అర్థానికి భిన్నంగా ఉపయోగిస్తున్నాం. ‘శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్త కళేబరే। ఔషధం జాహ్నవీ తోయం వైద్యో నారాయణో హరిః।।’ అన్న ఈ పూర్తి శ్లోకానికి అర్థం.. కృశించే లక్షణం కలిగిన, వ్యాధిగ్రస్తమైన ఈ శరీరానికి గంగాజలమే నిజమైన ఔషధం. నారాయణుడైన శ్రీహరే వైద్యుడు. అంటే, ముక్తిని ప్రసాదించేవాడు. అయితే, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి వైద్యం అందించి జీవితాన్ని నిలబెట్టే వైద్యుడిని సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడితో పోల్చటం సముచితమే!
- డాక్టర్ ఎ.యు.శంకర్‌ప్రసాద్, శివాస్ హెల్త్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్
వృత్తిలోనే ·మోక్షం
‘పరో భూత దయా ధర్మ ఇతి మత్వా చికిత్సయా వర్తతే యః స సిద్ధార్థః సుఖమత్యన్తమశ్రతే...’ అంటుంది చరక సంహిత. భూత దయ కలిగి ఉండటమే పరమ ధర్మం అని గ్రహించి చికిత్స చేసే వ్యక్తికి అన్ని రకాల అర్థాలు సిద్ధిస్తాయి. తద్వారా జీవితంలో సంతృప్తితో కూడిన గొప్ప సుఖం సొంతమవుతుంది. పరమ సుఖమైన మోక్షాన్ని పొందుతాడు అన్నది దీనర్థం. సరిగా పాటిస్తే.. వృత్తిలోనే మోక్షం పొందవచ్చన్న గొప్ప సత్యం ఇందులో కనిపిస్తుంది. వైద్యుడికి కావాల్సిన రెండు ప్రధాన గుణాలు శుచి/ పవిత్రత. భూతదయ. ఇవి రెండూ ఉన్న వైద్యుడు భగవంతుడి తుల్యుడవుతాడు.
ఇదీ చూడండి: Vaccine: నేటి నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి కొవిడ్ టీకాలు