పట్టు ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానాన్ని సంపాదించుకుంది. మేలైన బైఓల్టిన్ రకం పట్టు ఉత్పత్తి చేసినందుకు ఉత్తమ రాష్ట్రంగా జాతీయ పురస్కారానికి ఎంపికైనట్లు ఉద్యానశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధి తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పట్టు పరిశ్రమ శాఖ చేపట్టిన పనులు, ప్రోత్సాహకాలతో ఈ విజయాన్ని సొంతం చేసుకుందన్నారు. గత సంవత్సరం 2,807 టన్నుల పట్టుగూళ్ల ఉత్పత్తి జరిగింది. ఇందులో 1106 టన్నుల గూళ్ల నుంచి 158 టన్నుల పట్టు దారం తీశారు. కిలో పట్టుగూళ్లకు రూ.75, పట్టు దారానికి రూ.105 చొప్పున రాష్ట్రం ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఉత్పత్తి అయిన పట్టును నారాయణపేట, కొత్తకోట, పోచంపల్లిలోని మగ్గాలకు అందజేస్తున్నారు. ప్రైవేటు రంగంలో 10 రీలింగ్ పరిశ్రమలు ఉన్నాయి. చైనా వ్యాపారులు గద్వాల ప్రాంతంలో అతి పెద్ద రీలింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు పార్థసారథి వెల్లడించారు. ఈ నెల 9న దిల్లీలోని విజ్ఞానభవన్‌లో 'సర్జింగ్ సిల్క్' పేరుతో ప్రదర్శన, సదస్సును కేంద్ర సిల్క్ మండలి ఏర్పాటు చేస్తుంది. ఇందులో తెలంగాణకు పురస్కారాన్ని అందించనున్నారు.