కొవిడ్-19 వ్యాప్తితో రాష్ట్రంలో పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితమైనందున జీహెచ్ఎంసీ సహా అన్ని నగరపాలక, పురపాలక సంస్థలు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. లాక్డౌన్ కారణంగా పట్టణాల్లో వ్యర్థాలు భారీగా తగ్గాయి. జీహెచ్ఎంసీ మినహా మిగతా 141 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో రోజూ 3,700 మెట్రిక్ టన్నుల చెత్త రాగా.. ఇప్పుడు ఆ పరిమాణం దాదాపు వెయ్యి టన్నుల వరకు తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు.
కంటైన్మెంట్ జోన్లలో ప్రత్యేక జాగ్రత్తలు
రాష్ట్రవ్యాప్తంగా 82 శాతం వరకు చెత్త సేకరిస్తున్నారు. కంటైన్మెంట్ జోన్లలోని ఇళ్ల నుంచి రోజూ వ్యర్థాలు తీసుకుంటున్నామని.. కొవిడ్ పాజిటివ్ కేసులు ఉన్న ఇళ్లలో చెత్త సేకరణ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక కేటాయించిన పసుపు సంచుల్లో చెత్తను సేకరిస్తున్నారు. భస్మీకరణ ప్లాంటు అందుబాటులో లేనిచోట జేసీబీతో గుంత తీసి అందులో పడేస్తారు. ఇదే సమయంలో దోమలు, క్రిమికీటకాలు ఉత్పన్నం కాకుండా యాంటీ లార్వా ఆపరేషన్స్ చేపడుతున్నారు.
శుభ్రత కోసం వివిధ చర్యలు
రసాయనాల పిచికారీ కోసం పట్టణప్రగతిలో ఉపయోగించిన అదనపు వాహనాలను వినియోగిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని రాష్ట్రంలో నిషేధించిన నేపథ్యంలో.. ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఔషధ దుకాణాల నుంచి జ్వరం, తలనొప్పి, జలుబు, దగ్గు మాత్రలు తీసుకున్న వారి వివరాలను సేకరించి వైద్య, ఆరోగ్యశాఖకు అందించారు.
పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యమూ ముఖ్యమే..!
పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం విషయంలోనూ ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. కార్మికులందరికీ మాస్కులు, గ్లౌజులు అందించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు, గ్లౌజులతోనే విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. పారిశుద్ధ్య కార్మికులు ఎవరైనా స్వల్ప అనారోగ్యానికి గురైతే.. వారిని విధులకు దూరంగా ఉంచుతున్నారు. పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ ద్వారా పది లక్షలా యాబై వేలకు పైగా మాస్కులను పురపాలక శాఖ తయారు చేయించింది. కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక వాయిదా వేయగా ఆయా పురపాలికల పరిధిలో నిర్వహణా పనులు మూడు నెలల పాటు పాత గుత్తేదారుకే అప్పగించారు.
ఇదీ చూడండి: 'వేసవిలో భారత్ కరోనాను జయించొచ్చు!'