హైదరాబాద్ ఎల్బీనగర్ జోన్ పరిధి వనస్థలిపురంలోని ఎఫ్‌సీఐ కాలనీ ఫేజ్ 2 నందు ఏపుగా పెరిగిన చెట్లను నరికి వేస్తున్నారు. ఈ విషయాన్ని ఆ కాలనీకి చెందిన మెట్పల్లి సురభి మొదటగా అధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించారు. అనంతరం ఎంపీ జోగినిపల్లి సంతోశ్ కుమార్ దృష్టికి ట్విట్టర్ వేదికగా.. చెట్లను నరికి వేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు.
తక్షణమే స్పందించిన రాజ్యసభ సభ్యుడు సంతోశ్ కుమార్ ట్విట్టర్లో ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ దృష్టికి తీసుకువెళ్లారు. చెట్ల నరికివేతను ఆపించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ ట్వీట్‌తో మేయర్ బొంతు రామ్మోహన్ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డిని ఆదేశించారు.
ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి చెట్ల నరికివేతను ఆపించారు. దానికి బాధ్యులైన రమేశ్ బాబుకి రూ. 25 వేలు జరిమానా విధించారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు ఎవరూ చేసినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సామాన్యులు చేసిన ట్వీట్‌కు తక్షణం స్పందించి.. చెట్ల నరికివేత ఆపు చేయించడంపట్ల మెట్పల్లి సురభి, నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఎంపీ సంతోష్‌కు 'గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం'