కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను తెలంగాణ ప్రభుత్వమే తన సొంత నిధులతో చేపడుతున్నట్లు కేంద్ర జల్‌శక్తి శాఖ పార్లమెంటులో స్పష్టం చేసింది. అందులో అవినీతి చోటుచేసుకున్నట్లు తమ దృష్టికేమీ రాలేదని రాష్ట్ర ప్రభుత్వం తమకు సమాచారం అందించినట్లు లోకసభకు లిఖితపూర్వకంగా తెలియజేసింది. ఈ రెండు ప్రాజెక్టుల్లో అవినీతి గురించి కేంద్ర ప్రభుత్వం దృష్టికేమైనా సమాచారం అందిందా? అని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌టుడు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
అందుబాటులో ఉన్న వనరులు, ప్రాధాన్యాలను అనుసరించి సాగునీటి ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వాలే ప్రణాళికలు రూపొందించుకొని, అమలు చేస్తాయని.. కేంద్ర ప్రభుత్వం పాత్ర కేవలం సాంకేతిక సహకారం, కొన్ని ప్రాజెక్టులకు పాక్షికంగా నిధులు అందించడం వరకే పరిమితం అన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలకు అమలు చేస్తున్న నిబంధనలకు అనుగుణంగా కేంద్రం వ్యవహరించిందన్నారు. ప్రస్తుతం కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు రెండింటినీ తెలంగాణ ప్రభుత్వమే సొంత వనరులతో చేపడుతున్నందు వల్ల అవినీతి గురించి తమ దృష్టికేమీ రాలేదని సమాచారం అందించినట్లు పేర్కొన్నారు.
ఈ రెండు ప్రాజెక్టుల కోసం ఉద్దేశించిన డ్యాముల్లో లీకేజీలు కనిపించినట్లు కూడా తమ దృష్టికేమీ రాలేదని రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చిందని కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్‌టుడు తెలిపారు. తెలంగాణలో 8 నదీపాయలు కలుషితమైనట్లు మరో ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమాధానం ఇచ్చారు. ఇందులో మూసీ, మంజీర, నక్కవాగు, కరకవాగు, మానేరు, గోదావరి, కిన్నెరసాని, కృష్ణా నదులు ఉన్నట్లు చెప్పారు. శుద్ధి చేయకుండా వదిలే మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థ జలాలను వదలడం వల్లే దేశంలో నదులు ఎక్కువగా కలుషితమవుతున్నట్లు చెప్పారు. ఘన వ్యర్థాలను నదుల్లో, ఒడ్డుపైన పారబోయడం కూడా కాలుష్యానికి మరో కారణమన్నారు.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గత మార్చిలో అందించిన సమాచారం ప్రకారం.. దేశంలోని పట్టణ ప్రాంతాల నుంచి రోజూ 72,368 మిలియన్ లీటర్ల మురుగునీరు వస్తుంటే.. కేవలం 31,841 లీటర్లను శుద్ధిచేసే సామర్థ్యం మాత్రమే ఉన్నట్లు వెల్లడించారు. ఈ రెండింటి మధ్య ఉన్న తేడానే నదులను కలుషితంగా మార్చడానికి కారణమవుతున్నట్లు చెప్పారు. దేశ వ్యాప్తంగా 323 నదుల్లో 351 పాయలు కాలుష్యంగా మారినట్లు కాలుష్య నియంత్రణ మండలి గుర్తించిందని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: 'కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడితే దేశద్రోహమేనా...?'