హైదరాబాద్ నగరంలో వరద సాయంపై జరిగిన దోపిడీపై తాము పోరాటం చేస్తుంటే భాజపా వేరే విధంగా వ్యవహరిస్తోందని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. వరద సాయంలో జరిగిన అవినీతిపై విచారణ చేయమని ఎవరిని అడుగుతున్నారని భాజపాని ప్రశ్నించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చేతిలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఉన్నప్పటికీ... ఆయన ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని నిలదీశారు. భాజపా, తెరాస అనుబంధం పాలు, నీళ్ల లాంటిదని ఆయన పేర్కొన్నారు.
ఎంపీ ఎన్నికల సమయంలో కిషన్ రెడ్డికి సంబంధించిన రూ.8కోట్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్న కేసు ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని ఫిర్యాదు చేస్తున్న భాజపా నేతలు... ఎందుకు విచారణకు ఆదేశించడం లేదన్నారు. కిషన్ రెడ్డి జెంటిల్ మ్యాన్ అంటూ కేటీఆర్ ఎందుకు సర్టిఫికేట్ ఇచ్చారో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. వరద సాయంపై జరిగిన అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: బిహార్‌కు ఇద్దరు డిప్యూటీ సీఎంలు- భాజపాకే అవకాశం!