భారీ వర్షాలు రైతులను నిండా ముంచాయని, ఆ నష్టాన్ని తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం లాల్తండాకు చెందిన బానోత్ సురేశ్ అనే యువరైతు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమన్నారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లేకపోవడం వల్లే వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. భారీవర్షాలతో రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగినా... కనీసం ఏరియల్ సర్వే నిర్వహించడానికి కూడా కేసీఆర్‌కు తీరిక లేదా అని ప్రశ్నించారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉండటం వల్ల కేసీఆర్ తనయుడు కేటీఆర్ బస్తీల్లో మాత్రమే తిరుగుతున్నారని విమర్శించారు. బతుకమ్మ చీరల పంపిణీలో బీజీగా ఉన్న అధికారపార్టీ నేతలు భారీవర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు చొరవ చూపడం లేదన్నారు. ఇప్పుడు రైతులకు కావాల్సింది పరిహారమేకానీ రెండు వందల రూపాయల చీరలు కాదని విమర్శించారు. కౌలు రైతులకు పంట బీమా పథకాన్ని వర్తింపచేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: మాయమాటలతో ప్రజలను మోసగిస్తున్నారు: రేవంత్ రెడ్డి