Mou for Telangana Sona rice marketing: మంచి రుచి, తక్కువ మోతాదులో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటంతో.. తెలంగాణ సోన బియ్యం బహుళ ప్రాచుర్యం పొందుతోంది. రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో సైతం ఆహారంలో భాగం చేసుకునేందుకు వినియోగదారులు మంచి ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. కర్ణాటకతోపాటు దేశంలో పలు ప్రాంతాల్లో తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్-15048) వరి రకం బియ్యం మార్కెటింగ్ సంబంధించి బళ్లారికి చెందిన మల్లికార్జున రైస్ ఇండస్ట్రీస్ సంస్థ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం రెండు ఏళ్లపాటు అమలులో ఉంటుంది. ఒప్పంద పత్రాలపై మల్లికార్జున రైస్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు.. మల్లికార్జున్, మంజునాథ, వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. సుధీర్‌కుమార్ సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో పరిశోధనా సంచాలకులు డాక్టర్ వెంకటరమణ, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ డైరెక్టర్ డాక్టర్ జమునారాణి, రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
2015లో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రూపొందించిన తెలంగాణ సోనా వరి రకం వండగం పోషక విలువలతో పాటు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ మోతాదు ఉన్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. అనతికాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌సహా పలు రాష్ట్రాల్లో బహుళ ప్రాచుర్యం పొందడమే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఆ అన్నం తినేందుకు ఇష్టపడుతున్నారని డాక్టర్ సుధీర్‌కుమార్ అన్నారు.
జీవనశైలి వ్యాధులకు పరిష్కారంగా..
మనం తినే అన్నంలో చక్కెర శాతం, కార్బోహైడ్రేట్లు, గ్లైసిమిక్స్ సూచిక అధికంగా ఉండడంతో జీవన శైలి వ్యాధులకు బియ్యం కారణమవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ సమస్యలకు పరిష్కారంగా ఆచార్య జయశంకర్ వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు ‘తెలంగాణ సోనా’(ఆర్‌ఎన్‌ఆర్ 15048) సన్న బియ్యం రకం వంగడాన్ని అభివృద్ధి చేశారు.
ఇతర రకాల బియ్యంలో గ్లైసిమిక్స్ ఇండెక్స్ (ఇది ఎక్కువ ఉంటే మధుమేహం రావడానికి కారణం అవుతుందని అంచనా) 56.5% వరకూ ఉంటుండగా.. తెలంగాణ సోనాలో ఇది 51.5% మాత్రమే ఉంది. వానాకాలం, యాసంగి రెండు సీజన్లలోనూ తెలంగాణ సోనా రకం సాగుచేయవచ్చు. ఇతర రకాలకన్నా 30 రోజులు తక్కువ పంట కాలం వల్ల రైతుకు సాగు చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది.
ఇవీ చదవండి: