Traffic Problems in Hyderabad: రాజధాని నగరాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్య ట్రాఫిక్. భారీ వర్షం పడినా, ప్రధాన రోడ్డులో చిన్నపాటి వాహన ప్రమాదం జరిగినా వాహనదారులు ట్రాఫిక్ నరకాన్ని చూడాల్సి వస్తోంది. ఇటీవల ఫార్ములా ఈ-రేసింగ్ కోసం ట్యాంక్‌బండ్‌పై వాహనాలను నిల్పివేయడంతో నగరంలో సమస్య మరింత తీవ్రమైంది. దీనంతటికీ ప్రధాన కారణం ప్రత్యామ్నాయ రహదారులను నిర్మించకపోవడమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కొన్నింటిని గుర్తించినా కూడా వాటిని పట్టించుకోవడం లేదు. దీనిపై మంత్రి కేటీఆర్ దృష్టిసారించి ముఖ్యమైన రద్దీ జంక్షన్ల విస్తరణకు చర్యలు తీసుకోవాలని అనేక విజ్ఞప్తులు వస్తున్నాయి.
మహానగరంలో నిత్యం 50 లక్షల వాహనాలు తిరుగుతున్నాయి. దీనికి అనుగుణంగా ప్రధాన రోడ్ల విస్తరణ మాత్రం జరగడం లేదు. ప్రత్యామ్నాయ దారులపై దృష్టిసారించడం లేదు. ఒక్కప్పుడు ఎల్బీనగర్, నాగోలు జంక్షన్ల దగ్గర తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు ఏర్పడేవి. ఇక్కడ సమగ్ర రోడ్ల అభివృద్ధి పథకం కింద రూ.440 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించారు. దీంతో సమస్యకు పరిష్కారం దొరికింది. ఇలానే మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ జంక్షన్లలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి దాదాపు రూ.వెయ్యి కోట్లతో ప్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించారు. ఇలానే మిగిలిన చోట్ల కూడా పరిష్కారం దొరికే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
ఇవీ పరిష్కారాలు : ఖైరతాబాద్ సర్కిల్ తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుండటంతో ఇప్పుడున్న ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌కు అనుబంధంగా మరో వంతెన నిర్మాణం చేయాలని రోడ్లు భవనాల శాఖ ఆరేడేళ్ల కిందట ప్రతిపాదనలు రూపొందించింది. దీనివల్ల ఆస్కీలోని కొంత భాగం పోతుందన్న కారణంతో ఈ ప్రతిపాదనను పక్కన పెట్టారు. ఇలానే సోమాజిగూడ మక్కాకు ఆనుకుని నెక్లెస్ రోడ్డులోకి లింక్ రోడ్డును నిర్మించాలని తలపెట్టారు. సర్వే కూడా పూర్తి చేసిన తరువాత ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు.
* నాగార్జున సర్కిల్ నుంచి జీవీకే, తాజ్‌కృష్ణా, రోడ్డు నెంబర్‌వన్ బంజారాహిల్స్, మాసాబ్‌ట్యాంక్ మీదుగా రేతి బౌలి వరకు స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి అధికారులు సిద్ధమయ్యారు. అప్పట్లో నిధుల కొరత ఏర్పడిందన్న కారణంతో నిర్మాణం పనులను పక్కన పెట్టారు.
* ఇటీవల అటు శంషాబాద్, ఇటు మెహదీపట్నం వెళ్లే అత్తాపూర్ రోడ్డులో ట్రాఫిక్ తీవ్రమవుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయంగా అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 123 దగ్గర పీవీ ఎక్స్‌ప్రెస్‌వే పైకి వెళ్లేందుకు ర్యాంపులు నిర్మించాలన్న ప్రతిపాదన చేశారు. దీన్ని గురించి పట్టించుకోవడం లేదు.
ఇలా చేసినా ఉపయోగమే : కూకట్‌పల్లి-ఎల్బీనగర్ మార్గం, సికింద్రాబాద్- హైటెక్‌సిటీ మార్గాల్లో వాహనాల రాకపోకలు ఏఏ సమయాల్లో ఎక్కువగా ఉంటున్నాయి? ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తే ఎక్కడ వాహనాలు స్తంభించిపోతాయి? యూ-టర్న్‌లను మూసేసినా, కొత్తగా తెరిచినా ఎక్కడెంత ప్రయోజనం ఉంటుందన్న అంచనా వేసుకుని వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించాలి.
* ట్రాఫిక్ మళ్లింపులు ప్రకటించగానే.. పోలీస్ అధికారులు వివిధశాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు ట్రాఫిక్ తీరును పరిశీలించాలి. ట్రాఫిక్ నియంత్రణకు వేగంగా చర్యలు చేపట్టాలి.
* బస్టాపుల వద్ద ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలు నిలిపి ఉంచకుండా చర్యలు తీసుకోవాలి. ఒకేసారి వరుసగా ఆర్టీసీ బస్సులు రాకుండా అధికారులు సమన్వయం చేసుకోవాలి.
ఇవీ చదవండి: