రాష్ట్రంలో ప్రజలు వినియోగించే ఆహార పదార్థాల్లో అత్యధికం ఇక్కడ పండేవి కావు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. సన్నబియ్యం మొదలు... పప్పులు, కూరగాయలు, పండ్లు, వంట నూనెలు, సుగంధ ద్రవ్యాలు... అన్నీ దిగుమతులే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సైతం డిమాండు ఉన్న పంటల సాగు పెంచాలని సూచిస్తోంది. దీనివల్ల రైతులకు ఆదాయంతో పాటు వినియోగ దారులకూ ప్రయోజనం చేకూరుతుందని చెబుతోంది. మధ్యాహ్న, రాత్రి భోజనాల్లో రొట్టెలు, చపాతీలు తినేవారూ అధికమే. ఇందుకు అవసరమైన గోధుమ పిండి పూర్తిగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చేదే.
రాష్ట్రంలో 90 శాతానికిపైగా వినియోగించేవి పొద్దుతిరుగుడు, పామాయిల్, వేరుసెనగ నూనెలే. పామాయిల్ మలేసియా, ఇండోనేసియాల నుంచి, పొద్దుతిరుగుడు ఉక్రెయిన్, రష్యాల నుంచి, వేరుసెనగ నూనె గుజరాత్, ఏపీల నుంచి వస్తున్నాయి.
కుదురు లేని కూరలు
- రాష్ట్ర ప్రజలు ఏటా సగటున 26.10 లక్షల టన్నుల కూరగాయలు వినియోగిస్తున్నట్లు ఉద్యానశాఖ, జయశంకర్ వ్యవసాయ వర్శిటీ అధ్యయనంలో తేలింది. వీటిలో 10.15 లక్షల టన్నులు టమాటాలు, ఉల్లిగడ్డలే ఉన్నాయి. ఏటా లక్ష టన్నులకు పైగా వినియోగించే కూరగాయలు 9 రకాలున్నాయి. అవి టమాటా, ఉల్లి, బెండ, వంకాయ, కాకర, బీర, ఆకుకూరలు, పచ్చిమిరప, ఆలుగడ్డ. రాష్ట్రంలో టమాటా దిగుబడి బాగుందని ఉద్యానశాఖ చెబుతున్నా, ఏడాది పొడవునా పంట లభ్యం కాకపోవడంతో దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది.
- ధరల్లో అస్థిరత వల్లే రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, దిగుబడులు పెరగడం లేదని ఉద్యానశాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
అందరికీ అందని పండ్లు
రాష్ట్రంలో మామిడి, బత్తాయి తప్ప ఇతర పండ్లు పెద్దగా పండటం లేదు. జామ, దానిమ్మ, అరటి వంటివి మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటకల నుంచి, కమలా(సంత్రా)లు, సపోటా వంటివి హరియాణా, మహారాష్ట్ర, యాపిల్స్ హిమాచల్‌ప్రదేశ్, కశ్మీర్‌ల నుంచి వస్తున్నాయి. అందరికీ అన్ని రకాల పండ్లూ అందుబాటులో ఉండట్లేదు. జనాభాలో 87 శాతం మంది కేవలం అరటి పండ్లు వినియోగిస్తున్నట్లు ఆచార్య జయశంకర్ వర్శిటీ అధ్యయనంలో తేలింది.
నూనె గింజలకూ కటకట
తెలంగాణలో నూనెగింజల పంటల సాగు, దిగుబడులు పెద్దగా లేవు. ఆయిల్‌ఫెడ్ సంస్థ ‘విజయ’ బ్రాండు పేరుతో నెలకు 2700 టన్నుల వంటనూనెలను విక్రయిస్తోంది. ఇందులో 99 శాతం ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి తెచ్చిన సరకే.
వంట దినుసుల తంటా
నిత్యం కూరల్లో వాడే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, పసుపు, చింతపండు, కారం వంటి దినుసులకూ రాష్ట్రంలో కొరతే. వీటిలో పసుపు, కారం, పరిమితంగా అల్లం తప్ప మిగతావేవీ తెలంగాణలో పండటం లేదు. సంగారెడ్డి జిల్లా కోహీర్ ప్రాంతంలో పండే అల్లం నాణ్యత బాగుంటుందని దేశంలో పేరుంది. కానీ దాని ధరలకు భరోసా లేక రైతులు సాగును పెంచడం లేదు. జీలకర్ర, ఆవాలు వంటి రాజస్థాన్, హరియాణా వంటి ఉత్తరాది రాష్ట్రాల నుంచి నిత్యం వస్తున్నాయి. ఆ పంటలకు ఇక్కడ సరైన ధరలు దక్కవని, వాటిని శుభ్రం చేసే మిల్లులు స్థానికంగా లేవని రైతులు సాగుకు సుముఖత చూపట్లేదు.
సన్నాలు తక్కువే...
తెలంగాణలో రికార్డుస్థాయిలో వరిధాన్యం దిగుబడులొచ్చినా... అధికశాతం ప్రజలు వినియోగించే సన్న బియ్యం దిగుబడులు తక్కువే. గత ఏడాది (2020-21) 1.40 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేయగా, ఇందులో సన్నరకం ధాన్యం కేవలం 19 లక్షల టన్నులే. ఇక్కడ సాగు తక్కువగా ఉండడంతో ఏపీ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక నుంచి సన్నబియ్యం దిగుమతి అవుతుంటాయి.
పప్పుల తిప్పలు...
రాష్ట్రంలో కందిపప్పు, మినప, పెసర, సెనగ, ఎర్రపప్పు వంటివన్నీ కలిపి ఏటా దాదాపు 5.47 లక్షల టన్నులు అవసరం. అందులో సగానికి పైగా ఇతర రాష్ట్రాల నుంచే వస్తున్నాయి. రాష్ట్రంలో 18 పప్పు మిల్లులున్నా, ఏడాదిలో 100 రోజులకు పైగా ఖాళీగా ఉంటున్నాయని మిల్లుల సంఘం ప్రతినిధి ఒకరు తెలిపారు. రాష్ట్రంలో పప్పుధాన్యాల సాగు, మిల్లుల సంఖ్య పెంచే దిశగా ప్రయత్నాలు జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక్కడ పండే కొద్దిపాటి పంటలను కూడా ఇతర రాష్ట్రాల వ్యాపారులే కొని... పప్పుగా మార్చి విక్రయిస్తుంటారు.
కొరతకు ఇవీ కారణాలు
- రాష్ట్రంలో ఆయా పంటల సాగులో వెనకబాటుకు పలు కారణాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వపరంగా వరి, పత్తి మినహా మిగిలిన పంటలకు కొనుగోలు హామీ ఉండదు. వ్యాపారులపైనే ఆధారపడాలి.
- సన్నరకం వరికి మద్దతు ధర, దిగుబడి కూడా తక్కువ కావడంతో అన్నదాతలు దొడ్డు రకాలవైపే మొగ్గు చూపుతున్నారు.
- పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాల సాగుకు అనుకూలతలు ఉన్నా, మార్కెట్, ధరల హామీ, మిల్లులు లేకపోవడంతో రైతులు ముందుకు రావట్లేదు.
- కూరగాయలు, పండ్ల సాగుకు కూలీలు, రవాణా ఖర్చులు అధికం. పంటలకు ధరలు స్థిరంగా ఉండట్లేదు. పల్లెల నుంచి కూరగాయలను పట్టణాలకు తరలించడం సామాన్యరైతులకు కష్టమే. స్థానికంగానూ పెద్దగా మార్కెట్ ఉండదు. ఉద్యానశాఖ పరంగా ప్రోత్సాహకాలు, రాయితీలు లేవు.
- నూనె గింజల పంటలకు కేంద్రం మద్దతు ధరలున్నా, వీటి సాగుకు రాయితీలేమీ ఇవ్వడం లేదు. ఆయిల్‌పామ్‌కు ప్రోత్సాహమిచ్చే దిశగా ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోంది.
ఇదీ చూడండి: Vaccination: జంటనగరాల్లో నేటి నుంచి పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్..