Telangana SHE Teams : హైదరాబాద్లో బహిరంగ ప్రదేశాలు, కాలనీలు, బస్టాపుల్లో విద్యార్థినులను, యువతుల్ని వేధిస్తున్న వారిలో మైనర్లు పెద్ద సంఖ్యలో చిక్కుతున్నారు. షీ టీమ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డెకాయ్ ఆపరేషన్లలో సరాసరి 35-40 శాతం వరకు 18 ఏళ్ల లోపు విద్యార్థులే ఉన్నారు. అనుమతి లేకుండా ఫొటోలు తీయడం, అసభ్య పదజాలంతో దూషణలు, సామాజిక మాధ్యమాల్లో వేధించడం వంటి ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. మైనర్లు తమను వేధిస్తున్నారంటూ కొందరు వివాహితల నుంచి సైతం ఫిర్యాదులు అందుతున్నాయి.
ఇటీవల ఎల్బీనగర్ బస్టాప్ దగ్గర ఇద్దరు యువతులు నడుచుకుంటూ వెళ్తున్నారు. వారిని అనుసరిస్తున్న ఇద్దరు అల్లరి చేష్టలు, మాటలతో వేధించారు. అక్కడే మారువేషంలో ఉన్న షీ బృందాలు వారిని అదుపులోకి తీసుకున్నాయి. వారి వివరాలు ఆరా తీయగా ముగ్గురూ మైనర్లే అని తేలింది. కళాశాల విద్యార్థులు కావడంతో పోలీసులు కేసు నమోదు చేయకుండా తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు.
తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్: పోలీసులకు పట్టుబడిన మైనర్లకు తల్లిదండ్రుల ముందు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రుల ఆర్థిక నేపథ్యాన్ని చూస్తున్న పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. అన్ని వర్గాలవారు ఉంటున్నా ఎక్కువ మంది కూలీలు, ఉపాధి కోసం నగరానికి వచ్చినవారే అధికం. రోజంతా పనులకు వెళ్లిపోవడంతో పిల్లల ప్రవర్తనపై దృష్టి పెట్టలేకపోతున్నారు. పిల్లల తప్పిదాన్ని తెలుసుకుని ఎక్కువ మంది కుమిలిపోతున్నారు. వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వదిలేయాలంటూ పోలీసుల్ని వేడుకుంటున్నారు.