బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బంగ తీరాలను అనుకుని వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని పేర్కొంది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. ఇది ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి దిశ వైపునకు వంపు తిరిగి ఉందన్నారు. దక్షిణ గుజరాత్ నుంచి అల్పపీడన అనుబంధ ఉపరితల ఆవర్తనం వరకు దక్షిణ ఛత్తీస్గఢ్, విదర్భ, ఉత్తర మధ్య మహారాష్ట్ర మీదుగా 5.8 కి.మీ నుంచి 7.6 కి.మీ ఎత్తు మధ్య ఉపరితల ద్రోణి ఏర్పడిందని పేర్కొన్నారు.
దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. గురువారం చాలా చోట్ల, శుక్రవారం కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.
ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురంభీం–ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్-పట్టణ, వరంగల్-గ్రామీణ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?