అరేబియాలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తుపాను ప్రభావం ఈ నెల 16, 17 తేదీల్లో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
గురువారం అత్యధికంగా ధర్మపురి సమీపంలోని బుద్దేశ్‌పల్లిలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పలు ప్రాంతాల్లో 40 -43 డిగ్రీలుంది. బుధవారం ఉదయం 8 నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకూ 256 ప్రాంతాల్లో, గురువారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ 107 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. భద్రాద్రి జిల్లా నాగుపల్లిలో 4.3 సెంటీమీటర్లు, మద్దుకూరులో 3.9, అశ్వారావుపేటలో 3.9, అంకంపాలెంలో 3.2, మొగలమడ్క(నారాయణపేట జిల్లా)లో 3.1, షాబాద్(రంగారెడ్డి)లో 2.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా తమిళనాడు వరకూ గాలుల్లో అస్థిరత ప్రభావంతో శుక్ర, శనివారాల్లో తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు గాలులతో ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
ఇదీ చూడండి: నేటి నుంచే చార్ధామ్ యాత్ర.. భక్తులకు నో ఎంట్రీ