రాష్ట్రంలో రాగల రెండు రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, తూర్పు మధ్య, పశ్చిమ మధ్య ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలోకి నైరుతి రుతుపవనాలు విస్తరించాయని తెలిపింది.
రాగల 2 నుంచి 3 రోజుల్లో కర్ణాటక, తమిళనాడు, రాయలసీమ, కోస్తా ఆంధ్ర, నైరుతి బంగాళాఖాతం, మధ్య, ఈశాన్య బంగాళాఖాతం, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వెల్లడించింది.
తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది. తూర్పు మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతాల్లో 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో జూన్ 8న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించింది.
ఇవీ చూడండి:విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమా.. సాంకేతిక అంశాలా : హైకోర్టు