MLC Kavitha attends ED inquiry today : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ లిక్కర్ స్కామ్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన ఈడీ, సీబీఐ అధికారులు వారిని విచారిస్తున్నారు. ఇటీవలే ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కూడా నోటీసులు జారీ చేశారు. ఈనెల 11న దాదాపు 8 గంటల పాటు ఆమెను విచారించారు. ఈనెల 16న మరోసారి విచారణకు హాజరుకావాలని అదేరోజున నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో కాసేపట్లో కవిత.. మరోసారి ఈడీ విచారణకు హాజరు కానున్నారు.
మరోవైపు దిల్లీ మద్యం కేసులో తనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించిన నేపథ్యంలో ఆమె సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును ఆమె తరఫు న్యాయవాదులు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందు ప్రస్తావించి.. అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు.
కానీ సీజేఐ వెంటనే విచారణ చేపట్టడానికి నిరాకరిస్తూ ఈ నెల 24కు వాయిదా వేశారు. మహిళలను వారు నివసించే చోటే విచారించాలన్న సీఆర్పీసీ సెక్షన్ 160 నిబంధనలకు విరుద్ధంగా.. తనను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఈడీ ఇచ్చిన సమన్లను రద్దు చేయాలని కవిత ఆ పిటిషన్‌లో కోరారు. నిందితులపై ఈడీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తోందని ఆరోపించిన ఆమె.. తనను కూడా హింసించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తనపై ఈడీ కఠినచర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరారు.
Kavitha petition in Supreme Court on ED notices: ఈ నెల 11న తాను స్వచ్ఛందంగా ఫోన్‌ను అప్పగించినట్లు ఈడీ స్వాధీన ఉత్తర్వుల్లో పేర్కొనడాన్ని కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో తన పేరు లేకపోయినా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన కొందరి రాజకీయ నాయకుల ప్రోద్బలం వల్లే ఈడీ కేసు నమోదు చేసిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. కానీ ఆమె పిటిషన్‌ను వెంటనే విచారణ జరపడానికి న్యాయస్థానం నిరాకరించింది. 24వ తేదీన విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో ఇవాళ కవిత ఈడీ ఎదుటకు వెళ్లడం అనివార్యమైంది. ఈడీ విచారణ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత నిన్ననే దిల్లీ చేరుకున్నారు. ఆమె వెంట రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాఠోడ్ పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు దిల్లీ వెళ్లారు.
ఇవీ చదవండి:
'ఈడీని ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పి.. ఎందుకు సుప్రీంను ఆశ్రయించారు?'
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కాంగ్రెస్ పోరాడితే మేం మద్దతు ఇస్తాం: కవిత
మద్యం కేసుతో తనకు సంబంధం లేదన్న కవిత.. 16న మళ్లీ రావాలన్న ఈడీ