పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యే వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలు వదలొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. పలువురు మంత్రులు, నేతలతో ప్రగతిభవన్‌లో సమావేశమైన సీఎం.. ఎన్నికల వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు.. సొంత ఎన్నికల తరహాలో పూర్తి స్థాయిలో పని చేయాలని సూచించారు. తక్కువ సమయం ఉన్నందున.. అభ్యర్థి అన్ని నియోజకవర్గాల్లో తిరిగే అవకాశం లేదని వివరించారు. సురభి వాణీదేవి అభ్యర్థిత్వంపై మంచి స్పందన వస్తోందని తెలిపారు. తెరాసకు ఓటు వేసేందుకు పట్టభద్రులు సిద్ధంగా ఉన్నారంటూ.. రెండు స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఇన్‌ఛార్జీలుగా మంత్రులు..
మూడు ఉమ్మడి జిల్లాలను సమన్వయం చేస్తూ ఎన్నికల ప్రక్రియ కోసం ముగ్గురు మంత్రులను ఇన్‌ఛార్జీలుగా నియమించారు. రంగారెడ్డికి హరీశ్‌రావు, మహబూబ్‌నగర్‌కు ప్రశాంత్ రెడ్డిని ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. హైదరాబాద్ బాధ్యతలను గంగుల కమలాకర్‌కు అప్పగించారు. ఆయా జిలాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలను సమన్వయం చేస్తూ.. గెలుపు కోసం కష్టపడాలని సూచించారు.
సీఎం ఆదేశాలతో రంగంలోకి..
సీఎం కేసీఆర్ ఆదేశాలతో.. ముగ్గురు ఇన్‌ఛార్జ్ మంత్రులు ఆయా జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేశారు. హరీశ్‌రావు నేడు ఇబ్రహీంపట్నం, ఉప్పల్, మేడ్చల్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. గంగుల కమలాకర్.. సనత్‌నగర్ నియోజకవర్గంలో పర్యటించడంతో పాటు విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొననున్నారు. ప్రశాంత్ రెడ్డి.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సమావేశాల్లో పాల్గొననున్నారు.
ఇదీ చదవండి: మోగిన ఎన్నికల నగారా- ఇక సమరమే!