పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచార బరిలో అభ్యర్థులు, పార్టీల నేతలు దూసుకుపోతున్నారు. రెండు స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అధికార పార్టీ తెరాస శ్రమిస్తోంది. రాష్ట్రానికి ఎలాంటి మేలు చేయని భాజపాకు ఎమ్మెల్సీ ఓటు వేయొద్దని మంత్రులు నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని కేంద్రంలో అధికారంలోకి వచ్చి.. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారని మంత్రులు విమర్శించారు. మహబూబ్‌నగర్‌లో తెరాస ఎమ్మెల్సీ సన్నాహక సమావేశానికి హాజరైన మంత్రులు.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిందేమీ లేదని.. ఇప్పుడు చేయాల్సిందీ లేదని ఎద్దేవా చేశారు.
ఎర్రబెల్లి సతీమణి ప్రచారం..
వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రచారం చేశారు. కొందరు విద్యార్థులు పల్లా ప్రచారాన్ని నిరసిస్తూ.. ఆందోళన చేశారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించకుండా తెరాస ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తరఫున మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి, ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ ఉషా దయాకర్ రావు ప్రచారం చేశారు.
నాంపల్లిలో మంత్రి తలసాని..
చట్టసభల్లో మహిళా ప్రాతినిథ్యం పెరిగినప్పుడే.. మహిళల హక్కులు, సమస్యలపై మరింత సమర్థంగా పోరాడే అవకాశం ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో గ్రాడ్యుయేట్ అసోసియేషన్, ఎకనమిక్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
కొత్తగూడెంలో బండి సంజయ్..
ప్రజల పక్షాన పోరాడుతున్న భాజపాను పట్టభద్రులు గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. కొత్తగూడెంలో నిర్వహించిన ఆత్మీయ సభలో ఆయన పాల్గొన్నారు. భాజపా అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న వేళ పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు మరింత శ్రమిస్తున్నారు.
ఇదీ చూడండి: ఎన్నికల ప్రచారం: విమర్శలతో విరుచుకుపడుతున్న నేతలు