Dalit Bandhu scheme: రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దళిత బంధు పైలట్ ప్రాజెక్టుకు లబ్ధిదారులను ఫిబ్రవరిలోగా ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ఇప్పటికే ఎమ్మెల్యేలకు అప్పగించడంతో అర్హులైన ఎస్సీ కుటుంబాలు ఎమ్మెల్యేలకు దరఖాస్తు చేసుకుంటున్నాయి. గ్రామానికి కనీసం ఒక కుటుంబం చొప్పున ఎంపిక చేయాలా? లేదా నాలుగు గ్రామాల్లో 25 కుటుంబాల చొప్పున మొత్తం 100 మందిని ఎంపిక చేయాలా? విషయమై సమాలోచనలు జరుగుతున్నాయి. హుజూరాబాద్ మినహా 118 నియోజకవర్గాల్లో దళిత బంధు పథకం అమలుకు ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసింది. ఒక్కో నియోజకవర్గంలో వంద మంది చొప్పున ఎంపిక చేసి, మార్చి 31 లోగా యూనిట్లు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొదలు పెట్టారు. జీహెచ్‌ఎంసీతో పాటు నగరాలు, పట్టణాల్లోని నియోజకవర్గాల్లో అన్నివార్డులకు ప్రాధాన్యమివ్వాలా? ఏదేని ఒకటి రెండు వార్డుల్లోనే ఎంపిక చేయాలా? అనే విషయమై స్వేచ్ఛను శాసనసభ్యులకు అప్పగించింది.
ఏ విధంగా ముందుకు?
Dalit Bandhu Pilot Project: లబ్ధిదారుల ఎంపికకు ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న విషయమై ఎమ్మెల్యేల్లో సందిగ్ధం నెలకొంది. హుజూరాబాద్ నియోజకవర్గం, వాసాలమర్రి గ్రామంలో దళిత బంధు పథకాన్ని అన్ని ఎస్సీ కుటుంబాలకు అమలు చేశారు. తొలుత పథకాన్ని ప్రకటించినపుడు ఇప్పటి వరకు ప్రభుత్వ సహాయం పొందని కుటుంబాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ తరువాత సామాజిక, ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని భావించింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో అర్హులైన అన్ని కుటుంబాలకు సహాయం చేస్తామని ప్రకటించి, ఆ మేరకు లబ్ధిదారులను ఎంపిక చేసింది. తాజాగా నియోజకవర్గాల్లో వంద కుటుంబాలను ఎంపిక చేసేటపుడు ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న విషయమై గందరగోళం నెలకొంది. సామాజిక ఆర్థిక పరిస్థితి పరిశీలించాలా? లాటరీ విధానం అవలంబించాలా? అన్న విషయాన్ని పరిశీలిస్తున్నారు.
బస్సులు, టిప్పర్లతో ఆదాయం..
Dalit bandhu units:హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకం కింద యూనిట్లు అమల్లోకి వస్తున్నాయి. ఇప్పటికే 1000 కుటుంబాలు పథకం కింద తమ వ్యాపారాల్ని ప్రారంభించాయి. పలువురు డెయిరీలు పెట్టుకోగా, మరికొందరు కార్లు, ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. అందరూ ఒకేరకమైన యూనిట్లు ఏర్పాటు చేస్తే ఆర్థికంగా మనుగడ కష్టమవుతుందని భావించిన ప్రభుత్వం... ఇద్దరు, ముగ్గురు లబ్ధిదారు కుటుంబాలను ఏకం చేసి యూనిట్లు పెట్టించాలని ఇప్పటికే నిర్ణయించింది. ఇందులో భాగంగా ఐదుగురు లబ్ధిదారులను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి బస్సులు కొనుగోలు చేసి, ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని భావిస్తోంది. బొగ్గుగనులు ఎక్కువగా ఉండటంతో టిప్పర్లు కొనుగోలు చేసి సింగరేణితో మాట్లాడి అక్కడ అద్దెకు ఇచ్చేందుకు ఎస్సీ సంక్షేమశాఖ చర్చలు జరుపుతోంది.