పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీపై రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ధ్వజమెత్తారు. తనపై మధుయాస్కీ ప్రయోగించిన పరుష పదజాలంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలను ఖండించారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు సంస్కారంగా మాట్లాడే పద్ధతి అలవరుచుకోవాలని హితవు పలికారు. యాస్కీపై పలు ఆరోపణల చిట్టా విప్పారు. తెరాస నేత క్యామ మల్లేష్‌తో కలిసి తెలంగాణ భవన్‌లో సుధీర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
అన్నీ దొంగ సర్టిఫికెట్లే
మధుయాస్కీది దొంగ చదువని ఆయన ధ్రువపత్రాలన్నీ నకిలీవని సుధీర్ రెడ్డి ఆరోపించారు. మధుయాస్కీ అమెరికాలో ఉండి దొంగ సర్టిఫికెట్లు సృష్టించి ఎంతోమందిని అక్రమంగా ఆ దేశానికి తరలించారని వివరించారు. ఆ చిట్టా మొత్తం తన దగ్గర ఉందని.. ఎక్కడ చర్చ పెట్టినా ఇవన్నీ నిరూపించడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. యాస్కీ జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. ఎప్పటికైనా ఆయన చేసిన నేరాలు నిరూపించి జైలుకు పంపితీరుతానని స్పష్టం చేశారు.
కష్టపడి ఈ స్థాయికి వచ్చా
తాను కాంగ్రెస్‌లో ఒక్కో మెట్టు కష్టపడి ఎక్కానని సుధీర్ రెడ్డి చెప్పారు. కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదగడానికి 22 ఏళ్లు పట్టిందని వెల్లడించారు. టికెట్ రాలేదని ఎంతో మంది పార్టీ నుంచి వెళ్లిపోయినా ఓపికగా ఎదురు చూసినట్లు పేర్కొన్నారు. 2018 లో తనకు రావాల్సిన టికెట్‌ను కొందరు అమ్ముకున్నారని ఆరోపించారు.
మధుయాస్కీ నాపై ప్రయోగించిన పరుష పదజాలాన్ని ఖండిస్తున్నా. ఆయన వల్లే కాంగ్రెస్‌కు ఈ గతి పట్టింది. ఎప్పటికైనా యాస్కీ నేరాలు నిరూపించి జైలుకు పంపుతా. -సుధీర్ రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే
తనకు కాంగ్రెస్‌లో టికెట్ రాకుండా మధుయాస్కీ అడ్డుపడ్డారని సుధీర్ రెడ్డి మండిపడ్డారు. యాస్కీ లాంటి నేతలు కాంగ్రెస్‌ను భ్రష్టుపట్టించారని విమర్శించారు. నిజామాబాద్‌లోని ఏ విభాగంలోనైనా మధుయాస్కీతో చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: Supreme Court: ఎన్జీటీ తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ