Rajasingh Letter to TS Intelligence IG: ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల నుంచి తనకు ప్రాణహాని ఉన్నా.. ఇంటెలిజెన్స్ అధికారులు మాత్రం సరైన భద్రతాచర్యలు తీసుకోవడం లేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అసహనం వ్యక్తం చేశారు. పైగా తనపై దాడులు జరిగే విధంగా పోలీసుల చర్యలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ మేరకు తెలంగాణ ఇంటెలిజెన్స్ ఐజీకి మరో లేఖ రాశారు.
Raja Singh Comments on TS Intelligence: తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ మరమ్మతులకు గురవుతోందని... ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం ఉండటం లేదని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. మరమ్మతులకు గురైన వాహనాన్ని పంపిస్తే.... అధికారులు దాన్నే తిరిగి పంపిస్తున్నారని... ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమైన పనులపై బయటకు వెళ్తున్నప్పుడు దారి మధ్యలో వాహనం ఆగిపోతోందని చెప్పారు. నియోజకవర్గంలో పర్యటించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంటుందని... తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో గమ్యస్థానానికి చేరుకోలేక పోతున్నానని తెలిపారు.
2010 మోడల్‌కు చెందిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాని.. మార్గంమధ్యలోనే నిలిచిపోతోందని ఇంటెలిజెన్స్ ఐజీకి తెలిపారు. ఇటీవల కొంతమంది ఎమ్మెల్యేలకు నూతన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కేటాయించారని, అందులో తన పేరు లేకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు. దశాబ్దకాలంగా ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల నుంచి ప్రాణహాని ఉందని తెలిసినా... నూతన వాహనం కేటాయించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం తగదని లేఖలో తెలిపారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చలేకపోతే.. తనకు కేటాయించిన వాహనాన్ని తిరిగి తీసుకోండని అన్నారు. పాత వాహనాన్ని వినియోగించలేనని లేఖలో రాజాసింగ్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి: