MLA Rajasingh on CM KCR: దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం.. నూతన సంవత్సర వేడుకలు, నాంపల్లి ఎగ్జిబిషన్‌కు అనుమతి ఇవ్వడమేంటని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. అనేక రాష్ట్రాలు తమ ప్రజలను రక్షించుకునేందుకు నూతన సంవత్సర వేడుకలకు నిబంధనలు విధిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఒమిక్రాన్, కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంటే ముఖ్యమంత్రి, మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
రద్దు చేయాలి
దేశంలో కొవిడ్, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాలు.. వేడుకలు, జనసమూహం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అవేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి, మంత్రులు ఏం చేస్తున్నారు.?. మరో వైపు నాంపల్లి ఎగ్జిబిషన్‌కు అనుమతి ఇచ్చింది. ఆ ఎగ్జిబిషన్‌కు దేశ నలుమూలల నుంచి వచ్చి 2000 కు పైగా స్టాళ్లు ఏర్పాటు చేస్తారు. ప్రజలు కూడా ఎగ్జిబిషన్‌ను తిలకించేందుకు లక్షలాదిగా తరలివస్తారు. ప్రభుత్వం ఇకనైనా ఒమిక్రాన్ తీవ్రత గురించి ఆలోచించి ఎగ్జిబిషన్‌ను రద్దు చేయాలి. -రాజాసింగ్, గోషామహల్ ఎమ్మెల్యే
కేసులు పెరిగే అవకాశం
హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలోని నాంపల్లి ఎగ్జిబిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పట్ల రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎగ్జిబిషన్‌కు లక్షలాది మంది తరలివస్తారని రాజాసింగ్ పేర్కొన్నారు. దీని వల్ల కేసుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. జనసమీకరణ ఎక్కువగా ఉండే ఎగ్జిబిషన్‌ను ప్రభుత్వం నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: Minister KTR on Hyderabad Floods: 'వచ్చే వానాకాలంలో నగర ప్రజలకు ఇబ్బంది ఉండదు'