తెలంగాణలో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ను ఈసీ విడుదల చేసింది. నేటి నుంచి ఈనెల 16వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని వెల్లడించింది. 17వ తేదీన పరిశీలన చేస్తామని స్పష్టం చేసింది.
నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 22వ తేదీ వరకు గడువు ఉన్నట్లు ఈసీ పేర్కొంది. ఎమ్మెల్యేల కోటా కింద 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 29న ఉ.9 నుంచి సా.5 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేస్తామని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను ఈసీ విడుదల చేసింది. స్థానిక సంస్థల కోటాలో 9 జిల్లాల్లో ఖాళీ అయిన 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. ఈ నెల 16న నోటిఫికేషన్, 23 వరకు నామినేషన్ల స్వీకరణ.. ఈ నెల 24న నామినేషన్ల పరిశీలన, 26న ఉపసంహరణ తేదీలను వెల్లడించింది. డిసెంబర్ 10న పోలింగ్.. డిసెంబరు 14న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు ఈసీ పేర్కొంది.
ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ ,మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి.. కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండేసి స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నట్లు ఈసీ తెలిపింది.
ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు | స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు | |
నోటిఫికేషన్ | నవంబర్ 09 | నవంబర్ 16 |
నామినేషన్లు స్వీకరణ | నవంబర్ 09 నుంచి 16 వరకు | నవంబర్ 16 నుంచి 23 వరకు |
నామినేషన్ల పరిశీలన | నవంబర్ 17 | నవంబర్ 24 |
ఉపసంహరణ | నవంబర్ 22 | నవంబర్ 26 |
పోలింగ్ | నవంబర్ 29 | డిసెంబర్ 10 |
ఓట్ల లెక్కింపు | నవంబర్ 29 సాయంత్రం 5 నుంచి.. | డిసెంబరు 14 |
ఆశావహుల విశ్వప్రయత్నాలు
శాసనసభ కోటాలో ఎమ్మెల్సీ స్థానాల కోసం గులాబీ పార్టీలో ఆశావహులు విశ్వయత్నాలు చేస్తున్నారు. పోటీ ఎక్కువగా ఉండటంతో.. అభ్యర్థిత్వం ఖరారు చేసేందుకు తెరాస నాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. శాసన మండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ (VIDYA SAGAR), మాజీ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి (KADIYAM SRI HARI), ఆకుల లలిత, మహ్మద్ ఫరీదుద్దీన్ పదవీ కాలం జూన్ 3న ముగియడంతో ఈ ఎన్నికలు వచ్చాయి. ఈ ఆరుగురు తాజా మాజీలు మరోసారి అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు. ఆరుగురిలో ఇద్దరు ముగ్గురికి రెన్యువల్ కావొచ్చునని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. గుత్తా సుఖేందర్ రెడ్డి , కడియం శ్రీహరికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ నాయకులు భావిస్తున్నారు.
వారికి ఖాయమైనట్లేనా..!
శాసనమండలిలో అడుగుపెట్టాలని దాదాపు యాభై మంది గులాబీ నేతలు ఆశిస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ నుంచి గతంలో హామీ పొందిన వారితో పాటు పలువురు నేతలు తుది ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ ఇప్పటికే పలువురికి హామీ ఇచ్చినప్పటికీ.. వివిధ అంశాలను బేరీజు వేస్తున్నారు. పద్మశాలి, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి, రజకలను కచ్చితంగా ఎమ్మెల్సీ పదవులు ఇస్తానని జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెదేపా నుంచి తెరాసలో చేరిన ఎల్.రమణ, మాజీ స్పీకర్ మధుసూదనచారికి ఖాయమైనట్లేనని పార్టీలో విస్తృత ప్రచారం సాగుతోంది. నాగార్జునసాగర్ నియోజకవర్గం నేత ఎంసీ కోటిరెడ్డిని (KOTI REDDY) ఎమ్మెల్సీ చేస్తానని స్వయంగా కేసీఆర్ బహిరంగ సభలోనే ప్రకటించారు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో అదే సామాజిక వర్గం నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా రేసులో ఉన్నందున.. కేసీఆర్ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందేనని పార్టీ నాయకుల విశ్లేషణ.
రేసులో వీరు కూడా...
తుమ్మల నాగేశ్వరరావు (TUMMALA NAGESWARA RAO), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (PONGULETI SRINIVAS REDDY), జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ (BONTHU RAM MOHAN), మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ సీతారాం నాయక్, పార్టీ ప్రధాన కార్యదర్శులు తక్కళ్లపల్లి రవీందర్ రావు, శ్రీనివాస్ రెడ్డి, రావుల శ్రావణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ జి.నగేశ్, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, అరిగెల నాగేశ్వరరావు, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ సలీం, పీఎల్ శ్రీనివాస్, మర్రి రాజశేఖర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, తెరాస శాసన సభ పక్షం కార్యదర్శి మాదాడి రమేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మండవ వెంకటేశ్వరరావు, అరికెల నర్సిరెడ్డి, దేశపతి శ్రీనివాస్, గ్యాదరి బాలమల్లు, శాట్స్ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, తదితరుల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.
సమయముందిగా.. తొందరేంటి..
గవర్నర్ వద్ద పెండింగులో ఉన్న కౌశిక్ రెడ్డికి (KOUSHIK REDDY) ఎమ్మెల్యే కోటాలో అవకాశం ఇచ్చి.. గవర్నర్ కోటాలో గుత్తా సుఖేందర్ రెడ్డి లేదా మరొకరి పేరును కూడా సిఫార్సు చేయవచ్చని పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. పోటీ తీవ్రంగా ఉన్నందున ఒకటి, రెండు రోజుల్లో ప్రధాన ఆశావహులను పిలిపించి చర్చించాలని భావిస్తున్నారు. నామినేషన్లకు ఈనెల 16 వరకు గడువు ఉంది కదా.. తొందరమేటని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: 19 మంది మహిళలను మోసం చేసిన నిత్యపెళ్లికొడుకు