Etela On Third Front: భాజపాకు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్‌పై ఇతర రాజకీయ పార్టీల చర్చల నేపథ్యంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పలు వ్యాఖ్యలు చేశారు. గతంలో అనేక మంది దీనిపై చర్చలు జరిపారని.. కానీ ఎవరూ సఫలీకృతం కాలేకపోయారని విమర్శించారు. మళ్లీ ఇప్పుడు అలాంటి ప్రయత్నాలే జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన పరిణామాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా హోమాన్ని తలపెట్టారు. ఈ మేరకు హైదరాబాద్ జగద్గిరిగుట్టలో నిర్వహించిన మృత్యుంజయ హోమంలో ఈటల పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
అవసరాల కోసమే
ఏ పార్టీలైతే థర్డ్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయో.. వారు గతంలో అనుభవించిన వేదన ఏంటో తనకు తెలుసని ఈటల పేర్కొన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం.. కమ్యూనిస్టు పార్టీకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఈటల గుర్తు చేశారు. కానీ ఇప్పుడు పరస్పర అవసరాల కోసం ఫ్రంట్ పేరుతో చర్చలు తప్ప మరేమీ కాదని ఎద్దేవా చేశారు.
గతంలో అనేక సార్లు థర్డ్ ఫ్రంట్లు వచ్చాయి. కానీ ఏవీ కూడా సఫలం కాలేదు. ఇప్పుడూ అదే పునరావృతం అవుతుంది. గతంలో కమ్యూనిస్ట్ పార్టీకి కేసీఆర్ ప్రభుత్వం ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. పరస్పర రాజకీయ అవసరాల కోసమే ఈ ఫ్రంట్ చర్చలు.. ప్రజల కోసం కాదు. -ఈటల రాజేందర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే
అలసత్వమే కారణం
ప్రధానమంత్రి పర్యటనకు దాదాపు పది రోజుల ముందే రూట్ మ్యాప్, యాక్షన్ ప్లాన్ అధికారుల చేతుల్లో ఉంటుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అయినా పంజాబ్ ప్రభుత్వం ప్రధానమంత్రి సెక్యూరిటీ విషయంలో అలసత్వంగా వ్యవహరించిందని ఆరోపించారు. ప్రధాని మోదీ ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండాలని రాష్ట్రవ్యాప్తంగా ఆయుష్ హోమం, మృత్యుంజయ, శాంతి పూజలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో శృంగేరి పీఠం ఆధ్వర్యంలో అల్కాపురిలో నిర్వహించిన మృత్యుంజయ హోమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా నేతలు లక్ష్మణ్, రామ్‌చందర్‌రావు, మురళీధర్ రావు, డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు.
పంజాబ్ ఘటనపై పెద్ద కుట్ర దాగి ఉంది. ప్రధానిపై దాడి చేస్తే కాల్పులు జరుగుతాయి. ఘటనలో అమాయకులు చనిపోతారు. దీంతో పోలీసులతో కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే ఇలా చేయించిందని ఆరోపించాలనే నిర్ణయంతో ప్రతిపక్షాలు కుట్రపన్నాయి. - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
వాస్తవాలు తెలుసుకోకుండా
అంతకుముందుగా చైతన్యపురిలో భాజపా ఎస్సీ మోర్చా నిర్వహించిన మౌనధర్నాలో బండి సంజయ్ పాల్గొన్నారు. పంజాబ్ ఘటనపై వాస్తవాలు తెలుసుకోకుండా తెరాస.. కాంగ్రెస్‌కు వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. పంజాబ్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాన్వాయ్‌ను నిరసనకారులు అడ్డుకున్న ఘటనలో మహా కుట్ర ఉందని బండి సంజయ్ ఆరోపించారు. నిరసనకారులపై ఎస్పీజీ సిబ్బందితో కాల్పులు జరిపించి రైతులను చంపించి భాజపాను బదనాం చేయాలని కాంగ్రెస్ భావించిందని మండిపడ్డారు.
ఇదీ చదవండి: Harish rao on Modi Govt: ''జై కిసాన్' నినాదాన్ని నై కిసాన్‌గా మార్చింది భాజపా'