డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పురోగతిపై మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, తలసాని... ప్రగతి భవన్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లోని ఇళ్ల నిర్మాణంపై ప్రధానంగా మంత్రులు సమీక్షించారు. జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణం వేగంగా సాగుతోందని అధికారులు తెలిపారు. నిర్మాణాలు పూర్తవుతోన్న ప్రాంతాల్లో పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు.
హైదరాబాద్లోని మురికివాడల్లో ఇళ్ల నిర్మాణం వెంటనే పూర్తిచేసి లబ్దిదారులకు అప్పగించాలని సూచించారు. జేఎన్ఎన్యూఆర్ఎం, వాంబే పథకాల కింద నిర్మించిన ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక నెల రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఎంపికను అత్యంత పారదర్శకంగా జరపాలని అధికారులు, కలెక్టర్లకు తెలిపారు. పేదవారికి ఇళ్లు చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఎంపిక ప్రక్రియ పూర్తయ్యాక లాటరీ పద్ధతిలో ఇళ్లను కేటాయించాలని సూచించారు. లబ్దిదారులు ఒకచోట ఇళ్లు పొందాక మరోచోట దరఖాస్తు చేయకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, పలు శాఖల అధికారులు, కలెక్టర్లు సమీక్షలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి : 'సీఎం గారు.. టపాసులు పంపించండి'