కరోనా కారణంగా మూతపడిన విద్యాసంస్థలను వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పున:ప్రారంభించాలన్న (schools reopen) నిర్ణయానికి అనుగుణంగా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నామని... కొవిడ్ నిబంధనలకు లోబడి రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థల్లో భౌతికతరగతులు ప్రారంభించాలని ఆదేశించింది. విద్యాసంస్థల పున:ప్రారంభం సన్నాహకాలను ప్రారంభించిన సర్కారు... సన్నద్ధతపై ఆయా శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్య, వైద్య, పంచాయతీరాజ్, పురపాలక శాఖల అధికారులు, గురుకులాల అధికారులు, జడ్పీ ఛైర్మన్లతో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి (sabitha), ఎర్రబెల్లి దయాకర్ రావు (errabelli)దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.
తల్లిదండ్రులకు విశ్వాసం కల్పించాలి
భౌతికతరగతుల ప్రారంభానికి అనుగుణంగా విద్యాసంస్థలను సిద్ధం చేసే విషయమై మార్గనిర్ధేశం చేశారు. 17 నెలల తర్వాత 65 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలకు వస్తున్నందున తల్లిదండ్రులకు విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందుకు అనుగుణంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు బాధ్యత తీసుకొని... విద్యాసంస్థలను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. భౌతిక తరగతులు ప్రారంభమైతే ఆన్లైన్ తరగతులు నిర్వహించేది లేదని ప్రభుత్వం తెలిపింది. ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా పూర్తి స్థాయిలో కొవిడ్ నిబంధనలు పాటించాలని, లేదంటే చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని విద్యాసంస్థల్లోనూ పరిశుభ్రత, జాగ్రత్తలు పాటించేలా డీఈఓలు, అధికారులు పర్యవేక్షించాలని తెలిపింది. పాఠశాలలు తెరవాలని తల్లిదండ్రులు కోరుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఫీజుల విషయంలో ప్రైవేటు విద్యాసంస్థలు గతంలో జారీ చేసిన ఆదేశాలు పాటించాలని మంత్రి సూచించారు. కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే నెల వారీ వసూలు చేయాలని స్పష్టం చేశారు.
ఈనెల 30లోగా సిద్ధం చేయాలి..
పంచాయతీరాజ్, పురపాలకచట్టాల్లో పేర్కొన్న మేరకు విద్యాసంస్థల్లో పారిశుద్ధ్య నిర్వహణ స్థానికసంస్థల బాధ్యత అని... అందుకు అనుగుణంగా వాటిని పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని మంత్రులు తెలిపారు. 30వ తేదీ వరకు అన్ని పాఠశాలలను పూర్తి స్థాయిలో పరిశుభ్రం చేయాలని... గ్రామపంచాయతీలు, పురపాలికల ఆధ్వర్యంలో పరిశుభ్రతా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. పాఠశాల పూర్తి పరిశుభ్రంగా ఉన్నట్లు ప్రధానోపాధ్యాయుడు 30న ధృవపత్రం ఇవ్వాలని... అది జరగని పరిస్థితుల్లో చర్యలు తప్పవని పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. పాఠశాలలు ఎల్లప్పుడు శుభ్రంగా ఉండేలా చూడాలని చెప్పారు. గ్రామపంచాయతీల ద్వారా మాస్కులు కొనుగోలు చేసి విద్యార్థులకు మూడు చొప్పున ఇవ్వాలని ఆదేశించారు.
అన్నివేళలా అప్రమత్తంగా...
గురుకులాలు, వసతి గృహాల్లో పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వైద్యపరంగా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని... ఏఎన్ఎంలు, వైద్య సిబ్బందిని కూడా సిద్ధం చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు. ప్రతి విద్యార్థిని పూర్తి జాగ్రత్తగా చేసుకునేలా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరైనా అస్వస్థతకు గురైతే వెంటనే కొవిడ్ పరీక్షల చేయించాలని స్పష్టం చేశారు. ఎవరికైనా కొవిడ్ వస్తే మిగతా విద్యార్థులందరికీ పరీక్షలు చేయాలని ఆదేశించారు.
ఇదీ చూడండి: కేసీఆర్ అధ్యక్షతన తెరాస రాష్ట్ర కమిటీ భేటీ