కోవిడ్ 19 వ్యాప్తి దృష్ట్యా అందరూ అప్రమత్తమవుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తక్కువ మంది ఉద్యోగులు, సిబ్బంది విధులకు హాజరవుతున్నారు. మంత్రులు సైతం అదే తరహాలో తక్కువ మంది సిబ్బందితో సరిపెట్టుకుంటున్నారు. ఒక్కో మంత్రికి భద్రతాధికారితో పాటు భద్రతా సిబ్బంది, గన్ మెన్లు ఉంటారు. వీరికి అదనంగా పైలట్, ఎస్కార్ట్ వాహనాలు విడివిడిగా ఉండి అందులో కొంత మంది పోలీసులు ఉంటారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు పైలట్, ఎస్కార్ట్ వాహనాలకు కూడా పోలీస్ శాఖకు సంబంధించిన వారే డ్రైవర్లుగా ఉంటారు. దాదాపుగా ఒక్కో మంత్రి వెంట పది నుంచి 12 మంది వరకు పోలీసులు ఉంటారు. వీరితో పాటు డ్రైవర్లు, వ్యక్తిగత సిబ్బంది అదనంగా ఉంటారు.
అవసరమైతే తప్ప..
అయితే కొవిడ్ వ్యాప్తి, లాక్ డౌన్ అమలు నేపథ్యంలో మంత్రులు తమ వెంట ఎక్కువ మంది ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కొంత మంది మంత్రులు పైలట్, ఎస్కార్ట్‌లను తాత్కాలికంగా వినియోగించుకోవడం లేదు. తక్కువ మంది భద్రతా సిబ్బందితోనే రోజువారీ విధులు, పర్యటనలు సాగిస్తున్నారు. అటు వ్యక్తిగత సిబ్బంది విషయంలోనూ ఇదే తరహా విధానాన్ని అవలంభిస్తున్నారు. అవసరం ఉంటే తప్ప విధులకు హాజరు కావొద్దని వ్యక్తిగత కార్యదర్శులు, సహాయకులు, ఇతర సిబ్బందికి స్పష్టం చేశారు. అవసరమైతే కేవలం సదరు వ్యక్తులు తప్ప ఇతరులు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
ప్రగతి భవన్‌లోనూ అదే తరహా విధానం:
ముఖ్యమంత్రి అధికారిక నివాసం, కార్యాలయం ఉన్న ప్రగతి భవన్‌లోనూ ఇదే తరహా విధానాన్ని అవలంభిస్తున్నారు. అవసరం ఉన్న వారు తప్ప ఇతరులు ప్రగతి భవన్‌కు రావొద్దని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి అమలు చేస్తున్నారు. మంత్రులు, ప్రముఖుల భద్రతను పర్యవేక్షించే సెక్యూరిటీ వింగ్ కూడా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటుంది. సాధారణంగా మంత్రులు, ప్రముఖుల వద్ద రెండు బృందాలు విధులు నిర్వర్తిస్తుంటాయి. అందులో ఒక బృందం విధుల్లో ఉంటే మరో బృందం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ప్రభుత్వ క్వారంటైన్లో ఉంటుంది తప్ప బయటకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం లేదు. అయితే జిల్లాల నుంచి కేటాయించిన గన్ మెన్లు మాత్రం మంత్రులు, ప్రముఖుల వద్ద విధులు లేని సమయంలో జిల్లాల్లో ఇతర విధులకు హాజరవుతున్నారు.
ఇదీ చూడండి: పోలీసులను చూసి భయమేసింది... కొత్తిమీర రోడ్డు పాలైంది